కరొనకు విషపూరితం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందు!

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మందులే లేవనుకున్న సమయంలో మలేరియాకు వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ) గోలీలు బాగా పని చేస్తున్నాయని, ఆ మందు సంజీవని అంటూ అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. అందుకు మన దేశంలో కూడా పలువురు నేతలు తల ఊపారు. అయితే ఆ మందు సంజీవని కాదని, విషం అని పరిశోధకులు అధ్యయనం పేర్కొన్నది.

అధ్యయనం ప్రకారం కరోనా సమయంలో ఆ మందును తీసుకోవడం వల్ల 17 వేల మరణాలు సంభవించాయని తేలింది.  కరోనా నివారణలో అద్భుత ఔషధంగా ప్రచారం చేయబడిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మందు వినియోగం వల్ల మరణాల రేటు 11 శాతం వరకు పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌వో) మాజీ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ పేర్కొనడం చర్చనీయాంశమైంది.

కరోనా మహమ్మారి ఉధృతంగా ఉన్న సమయంలో డబ్ల్యుహెచ్‌వో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సంభావ్య మందుగా భావించిందని, కానీ తాము దాని వాడకానికి వ్యతిరేకంగా సిఫారసు చేసినట్లు సౌమ్య స్వామినాథన్‌ తెలిపారు. అయితే క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తికాక ముందే ఆ మందుపై అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటన చేయడం, భారత్‌లో ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ప్రధాని మోదీని కోరడం తెలిసిందే.

ట్రంప్‌ కోరడంతో తాము ప్రపంచానికి అవసరమైన క్లోరోక్విన్‌ మందులను సరఫరా చేస్తామంటూ ఎగుమతులపై నిషేధాన్ని భారత ప్రభుత్వం తొలగించింది. కానీ తర్వాత జరిగిన పరిశోధనల్లో హెచ్‌సీక్యూ మందు దీర్ఘకాలికంగానూ, అధిక మోతాదులో వాడకం వల్ల దుష్ప్రభావాలుంటాయని తేలింది. కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా మరోసారి బుసలు కొడుతున్నది. గత డిసెంబర్‌ ఒక్క నెలలోనే 10 వేల మంది వైరస్‌ బారిన పడి మరణించినట్టు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. జేఎన్‌.1 వేరియంట్‌, పండుగల సీజన్‌ కావడంతో మరణాల సంఖ్య పెరిగినట్టు తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.