ప్రకృతిని కాపాడుకోవడమే నిజమైన దేశభక్తి

ప్రకృతిని కాపాడుకోవటమే నిజమైన దేశభక్తి అని భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రకృతిని ప్రేమించటం, ప్రకృతితో కలిసి జీవించటమే మన సంస్కృతి అని స్పష్టం చేశారు. మకర సంక్రాంతి పర్వదినం సమీపిస్తున్న వేళ  శుక్రవారం ఆత్కూర్ లోని స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ లో జరిగిన సంప్రదాయ బద్ద సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు.  
 
అంతకుముందు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.  తెలుగువారి పెద్ద పండగ అయిన సంక్రాంతి ప్రకృతితో మమేకమైన పెద్ద వేడుక అని చెప్పారు.
 
మానవాళి జీవితంలో పశు పక్ష్యాదుల సహకారం వెలకట్టలేనిదని,  అందుకే భారతీయ సంస్కృతిలో సంక్రాంతి మరునాడు వచ్చే కనుమ రోజున పశువులను పూజించి, గౌరవించి పండుగ చేస్తారని, ప్రపంచంలో మరే ప్రాంతంలోనూ ఇలా పశువులను గౌరవించే సంస్కృతి లేదని చెప్పారు. పశుసంపదే దేశ సంపద అని మహాత్మా గాంధీ స్పష్టం చేసిన సంగతిని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు.

అంతకుముందు శుక్రవారం ఉదయం మకర సంక్రాంతి సంబరాలు గంగిరెద్దుల ఆటలతో సంప్రదాయ సిద్ధంగా, ఘనంగా ప్రారంభమయ్యాయి. గొబ్బెమ్మలు కొలువుతీరిన అందమైన రంగవల్లులు, గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల సంకీర్తనలు, సంప్రదాయ సంగీత విభావరులతో అందమైన పల్లె వాతావరణం కళ్ళముందు సాక్షాత్కరించింది.  
 
ఆడిటోరియంలో వేదిక ముందు సిరి ధాన్యాలతో తీర్చిదిద్దిన రంగవల్లిక ఎంతో ఆకట్టుకోవడంతోపాటు ధాన్యాల ప్రాధాన్యాన్ని తెలియజెప్పింది. వేదిక అలంకరణ పల్లె లోగిలిని తలపించింది. తిరుమల తిరుపతి దేవస్థానం గాయకులు వేదవ్యాస  ఆనంద భట్టర్  ఆలపించిన అన్నమయ సంకీర్తనలు ఆధ్యాత్మిక తన్మయత్వంలోకి తీసుకువెళ్లాయి.
 
సంక్రాంతి పర్వదినం విశిష్టతను వివరిస్తూ గరికపాటి నరసింహారావు చేసిన ప్రవచనం నేటి తరానికి మార్గదర్శనంగా ఉంది. ప్రముఖ గాయకురాలు శ్రీమతి ఎస్పీ శైలజ గారి సినీ సంగీత విభావరి ఎంతో అలరించింది. కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఆత్మీయ అతిథిగా, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ మంత్రి డా. కామినేని శ్రీనివాస్, స్వర్ణ భారత్ ట్రస్ట్ సభ్యురాలు శ్రీమతి దీపా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.