చంద్రబాబు ఫొటోను బండకేసి కొట్టిన రాయపాటి రంగారావు

మాజీ  ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగారావు టిడిపికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక దిక్కుమాలిన పార్టీ అని దుయ్యబట్టారు. టీడీపీ అసలు రాజకీయ పార్టీయే కాదన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థ అని ఆరోపించారు రాయపాటి రంగారావు.
 
తమ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది తెలుగుదేశం పార్టీనేనని రంగారావు మండిపడ్డారు. గత ఎన్నికల్లో  రూ. 150 కోట్లు తమ నుంచి తీసుకున్నారని పేర్కొంటూ నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ఎంత తీసుకున్నారో తమ దగ్గర లెక్కలు కూడా ఉన్నాయని చెప్పారు. అంతేగాక, మంగళగిరిలో లోకేష్ ఎలా గెలుస్తాడో చూస్తా? అని నిలదీశారు. సవాల్ చేసి చెబుతున్నాలోకేష్‌ను మంగళగిరిలో ఓడిస్తానని స్పష్టం చేశారు.
తాను సత్తెనపల్లి నుంచి సీటు ఆశించానని, కానీ అది వేరొకరికి కేటాయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  అక్కడ కన్నా లక్ష్మీనారాయణకు సీటు ఇస్తున్నట్లుగా కనీసం తమకు మాటమాత్రమైనా చెప్పలేదని వాపోయారు.
 
‘కియా కంపెనీ నేనే తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. మరి రాయలసీమలో ఎందుకు ఓడిపోయాడు? గత ప్రభుత్వంలో ఎస్సీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను చంద్రబాబు లోకేష్ ఎక్కడ పనిచెయ్యనిచ్చారు? కన్నా లక్ష్మీనారాయణ ఒక్క కులానికి పని చేస్తాడు. మేము అన్ని కులాలకు పని చేస్తాం’ అని రాయపాటి రంగారావు వ్యాఖ్యానించారు.
 
రంగారావు ఆశిస్తున్న సత్తెనపల్లి సీటును కొత్తగా చేరిన కన్నా లక్ష్మీనారాయణకు ఇవ్వడంతో కొంతకాలంగా రాయపాటి కుటుంభం టిడిపి పట్ల అసంతృప్తితో ఉంటూ వస్తున్నది.  టీడీపీకి రాజీనామా చేసిన రాయపాటి రంగారావు తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాను పార్టీలో ఇమడలేనని, తన రాజీనామా లేఖను ఆమోదించాలని ఆ లేఖలో కోరారు. 
 
ఆయన కుటుంబ సభ్యులు ఆఫీసులో ఉన్న చంద్రబాబు ఫొటోను నేలకేసి పగలగొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలియడంతో రంగారావు కుటుంబం టీడీపీని వీడుతున్నట్లు సమాచారం.