నాలుగేళ్ల త‌ర్వాత స్వ‌గ్రామంలో ఎంపి రఘురామకృష్ణరాజు

నాలుగేళ్ల విరామం త‌ర్వాత వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆంధ్ర ప్రదేశ్ లో అడుగుపెట్టారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమానంలో చేరుకున్న ఆయనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. గజమాలతో ఆహ్వానం పలికారు. భారీ సంఖ్యలో ఎయిర్ పోర్టుకు చేరుకున్న అభిమానులతో ఆ ప్రాంతం కిక్కిరిసి పోయింది. 
 
టీడీపీ, జనసేన కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. రఘురాజు అనుకూల నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. 
ఇక రఘురామరాజు కూడా అభిమానులకు ఉత్సాహంగా షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు సాగారు. రాజమండ్రి నుంచి భీమవరంకు ఆచంట, పాలకొల్లు మీదుగా ఆయన భారీ ర్యాలీగా త‌న స్వ‌గ్రామానికి త‌ర‌లివెళ్లారు. 
 
ఆయ‌న వెంట వందలాది కార్లు రఘురామరాజును అనుసరించాయి. ఈ సంక్రాంతిని తన నియోజకవర్గంలో ఆయన బంధుమిత్రులతో కలిసి జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రఘురామ రాజు మాట్లాడుతూ ”నాలుగేళ్ల తర్వాత భీమవరం వెళ్లడం సంతోషంగా ఉంది. నేను జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్‌ కల్యాణ్‌ అందించిన సహకారం మరవలేనిది. అభిమానులు, తెదేపా, జనసేన నాయకులు చూపిన ప్రేమ మరవలేను. సొంత వారెవరో పరాయి వారెవరో అర్థమవుతోంది” అని తెలిపారు.
 
తనను సొంత నియోజకవర్గానికి రాకుండా అధికార పార్టీ నేతలు ఎన్నో కుట్రలు చేశారని మండిపడ్డారు. నాన్నమ్మ చనిపోయినప్పుడు కూడా రాలేకపోయానని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో చాలా భాధ అనిపించిందని చెబుతూ ఇప్పుడు కోర్టు రక్షణతో సొంతూరు వెళ్ళటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
 
తనను ఇబ్బందులకు గురిచేసి ప్రజల్లో మంచి ఆదరణ కల్పించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అంటూ ఎద్దేవా చేశారు.  అయితే గతంలో పెండింగ్ లో ఉన్న కేసుల్లో పోలీసులు తనను అరెస్టు చేసే ప్రమాదం ఉందని ఊహించి ఆయన ముందుగా హైకోర్టును ఆశ్రయించారు.   హైకోర్టు పోలీసులకు నిబంధనల మేరకు వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఎంపీకి ఇవ్వాల్సిన భద్రత కల్పించాలని ఆదేశించింది. దీంతో రఘురామ సొంత ఊరికి బయలుదేరేందుకు ఆటంకాలు తొలిగాయి.