ధరణిలో 119 లోపాల గుర్తింపు

ధరణిలో 119 లోపాల గుర్తింపు
రైతుల భూముల నమోదుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా చేపట్టిన ధరణి పోర్టల్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ ఇప్పటి వరకు 119 లోపాలను గుర్తించింది. వీటి పరిష్కారం కోసం పటిష్టమైన ధరణి సాఫ్ట్ వేర్ అవసరమని వారు గుర్తించారు. ఈ పోర్టల్ లో తలెత్తిన సమస్యలను  శాస్త్రీయ దృక్పథంతో అధ్యయనం చేసేందుకు రాష్త్ర ప్రభుత్వం గత వారం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. 
 
ఈకమిటీ సభ్యులు కోదండ రెడ్డి, లచ్చి రెడ్డి, సునీల్‌ రెడ్డి గురువారం సచివాలయంలో మొదటిసారిగా సమావేశమై ఆర్వో యాక్ట్ ఉన్నప్పటికీ స్పష్టమైన గైడ్ లైన్స్, ప్రోటోకాల్ చట్టబద్ధమైన అధికారాలు ఇవ్వకపోవడంతో భూ సమస్యలు వస్తున్నాయని గుర్తించారు.  రెవెన్యూ శాఖలో సరైన బిజినెస్ రూల్స్ రూపొందించక పోవడంతో అధికారులు అయోమయానికి గురై రైతులకు సమస్యల పరిష్కారం చూపలేకపోయారని, అధికార వికేంద్రీకరణ లేకపోవడంతో సమస్య ఉత్పన్నం అయినప్పుడు కోర్టును ఆశ్రయించే దుస్దితి నెలకొందని భావిస్తున్నారు. 

ఇక నుంచి భూ సమస్యలు వస్తే అధికార వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందనే విషయాలను గుర్తించారు. మండల స్థాయిలో భూ సమస్యలను పరిష్కరించేందుకు తహసీల్దార్, డివిజన్ స్థాయిలో ఆర్‌డిఓ, జిల్లా స్థాయిలో కలెక్టర్, రాష్ట్ర స్థాయిల్లో సిసిఎల్ అధికారులకు మార్గదర్శకాలు విడుదల చేసేందుకు విధివిధానాలపై దరణి కమిటీ చర్చించింది.ఈనెల 17న మరోసారి ధరణి కమిటీ సమావేశం కానుందని సభ్యులు తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2017లో కెసిఆర్ ప్రభుత్వం భూ ప్రక్షాళన కార్యక్రమం చేపట్టడంతో లక్షలాదిమంది రైతులు భూమి హక్కులు కోల్పోయారని, ప్రభుత్వానికి, అధికారులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోకపోవడంతో చాలా మంది అన్నదాతలు ఆత్మహత్య చేస్తుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

త్వరలో రాష్ట్రంలో రైతులకు భూసమస్యలు లేకుండా చేస్తామని చెబుతూ  సిసిఎల్‌ఏ కార్యాలయంలో ధరణి కమిటీకి ప్రత్యేక కార్యాలయం కేటాయించినట్లు తెలిపారు. ఎవరైనా రైతులకు సమస్యలుంటే వాటిని కమిటీ చర్చి పరిష్కారించేందుకు కృషి చేస్తుందని చెప్పారు.