వికలాంగులలో ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించండి

వికలాంగులలో ప్రత్యేక నైపుణ్యాలను గుర్తించి, వారికి అన్ని రంగాల్లో సమాన అవకాశాలను కల్పించాల్సిన అవసరాన్ని పలువురు వక్తలు గుర్తు చేశారు. జాతీయ యువజన దినోత్సవం, స్వామి వివేకానంద 161వ జయంతి సందర్భంగా కొత్తపేటలోని మానస ఇనిస్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ డిజబిలిటీ స్టడీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమినార్‌లో మాట్లాడుతూ వికలాంగులు తమ నైపుణ్యంతో రాణించేందుకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని కోరారు.
 
ముఖ్యఅతిథిగా పాల్గొన్న జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సి) సభ్యురాలు ఎస్. విజయభారతి మాట్లాడుతూ వికలాంగులు చాలా అమాయకులు, నిజాయితీపరులు, గొప్ప మానవీయ గుణాలు కలిగి ఉంటారని చెప్పారు. వారిలో ఎటువంటి కల్మషం, రాగద్వేషాలు ఉండబోవని స్పష్టం చేస్తూ ప్రభుత్వంతోపాటు వివిధ జాతీయ సంస్థలు వారి హక్కులను గుర్తిస్తున్నాయని చెలిపారు. 
 
అన్ని రంగాల్లో వారికి తగు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె చెబుతూ వైకల్యం గలవారు ఏ విధంగానూ వివక్షకు గురికాకుండా చూసేందుకు ఎన్‌హెచ్‌ఆర్‌సి అనేక విధాలుగా పనిచేస్తోందని తెలిపారు. వారిని ఎటువంటి వివక్షతకు గురిచేసినా, వారి పట్ల అవమానకరంగా ప్రవర్తించినా తగు చర్య తీసుకోవడానికి వివిధ యంత్రాంగాలు అందుబాటులో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
 
సామాజికంగా తోటివారు సహితం వారి పట్ల గౌరవంగా వ్యవహరించాలని, వివిధ రంగాల్లో నైపుణ్యంతో కూడిన కార్యకలాపాలను పెంపొందించేలా ప్రోత్సహించాలని విజయ భారతి కోరారు. ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ వారికి శారీరకంగా కొన్ని పరిమితులు ఉండొచ్చు కానీ, అనేక నైపుణ్యాల్లో వారు ఎవ్వరికీ తీసిపోరని స్పష్టం చేశారు. 
 
తాము చేపట్టిన కెరీర్‌లో కొత్త శిఖరాలను అందుకోవాలనే వారి జీవిత ఆశయాలకు వైకల్యం అడ్డుకట్ట వేయకుండా తగు సదుపాయాలు కల్పించాలని ఆయన సూచించారు.  వికలాంగులు ప్రత్యేక నైపుణ్యాలను ప్రదర్శించేవారని, వారికి అవసరమైన మానసిక మద్దతు ఉండేలా చూడాలని డా. శ్రీనివాసులు చెప్పారు. సమాజంలోని వివిధ వర్గాలు  వికలాంగులకు భాగస్వామ్య మద్దతు కల్పించవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. 
 
 ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రో-చైర్మన్ మల్కా కొమరయ్య మాట్లాడుతూ తన విద్యాసంస్థల సమూహం వికలాంగుల అవసరాలను తీర్చడానికి సాధ్యమైన సహాయాన్ని అందించగలదని హామీ ఇచ్చారు. అంతకుముందు వికలాంగ యువత పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.  ప్రిన్సిపాల్ లక్ష్మి తమ సంస్థలో ఫిజియో థెరపీ, మేధో వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాల, న్యూరో డెవలప్‌మెంటల్ క్లినిక్, వికలాంగుల కోసం వృత్తి శిక్షణా కేంద్రం వంటి వివిధ సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వివరించారు.