సరయూ నది ఒడ్డున ‘రామాయణ ఆధ్యాత్మిక వనం’

* 22న వారణాసిలో ఉచిత బోట్ ప్రయాణం
 

అయోధ్యను సందర్శించే భక్తులు నగరంలోని సరయూ నది ఒడ్డున నిర్మితమవుతున్న ‘రామాయణ ఆధ్యాత్మిక వనాన్ని’ సందర్శించడం ద్వారా శ్రీరాముడి 14ఏళ్ల వనవాసం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవచ్చు. రామాయణ వైభవాన్ని ప్రదర్శించే ఓపెన్‌ ఎయిర్‌ మ్యూజియంను తలపించేలా ఈ వనం పర్యావరణహితంగా ఉండనుంది.

అయోధ్య మా స్టర్‌ ప్లాన్‌లో భాగంగా దీన్ని సిద్ధం చేస్తున్నారు. శ్రీరాముడు, రామాయణం, అయోధ్యతో పాటు సరయూ నది కూడా హిందూమతం నుంచి విడతీయరాని భాగమని అయోధ్య పునరాభివృద్ధి ప్రాజెక్టు చీఫ్‌ ప్లానర్‌ దిక్షు కుక్రేజా అన్నారు. నది ఒడ్డు వెంబడి ప్రతిపాదిత ఆధ్యాత్మిక వనాన్ని రామాయణం ఇతివృత్తంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
ఇందులో రాముడు వనవాస సమయంలో చేసిన ప్ర యాణాన్ని ప్రత్యేకంగా వివరించినట్లు తెలిపారు. ఈ వనం భక్తులతో పాటు పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుందని చెప్పారు. కాగా, అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా 1,111 శంఖాలతో జయధ్వానం చేయనున్నారు. ఈ మేరకు యూపీ సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ స్థాయిలో ఒకేసారి శంఖారావాలు చేసిన సందర్భం గతంలో ఎన్నడూ లేదని అధికారులు తెలిపారు.
 
మరోవంక, అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే న్యూయార్క్‌ టైమ్స్‌ స్కేర్‌ వద్ద లైవ్‌ ప్రసారం కానుండగా, కాలిఫోర్నియా, వాషింగ్టన్‌, న్యూయార్క్‌, చికాగో, యూరోపియన్‌ దేశాలు, కెనడా నగరాల్లో ర్యాలీలు, లైవ్‌ షోలు ప్రసారం చేసే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.
 
రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా వారణాసి బోటు నిర్వాహకులు వారణాసిలోని మొత్తం 84 గంగా ఘాట్లలో ఈ నెల 22న ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ప్రకటించారు. గంగా నిషద్‌ రాజ్‌ సేవా ట్రస్ట్‌ సెక్రటరీ శంభు సాహ్ని మాట్లాడుతూ నిషద్‌ వర్గంతో శ్రీరాముడికి గొప్ప సంబంధం ఉన్నదని తెలిపారు. శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి అడవి గుండా ప్రయాణించే సందర్భంలో నిషద రాజు వారిని ఉచితంగా నది దాటించారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరగనున్నందున ఆ రోజు తాము కూడా ఉచితంగా బోటు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు పేర్కొన్నారు.