ఏపీ ఎన్నికల విధుల్లో జగన్ దూరంగా ఉంచిన ఉపాధ్యాయులు

రెండు రోజుల ఆంధ్ర ప్రదేశ్ పర్యటనలో ఎన్నికల సన్నాహాలలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టె విధంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన దూరంగా ఉంచుతూ వస్తున్న ఉపాధ్యాయులకు ఎన్నికల విధులు అప్పచెప్పాలని స్పష్టం చేసింది. 

రాష్ట్రంలో ఎన్నికల విధులకు వైసీపీ ప్రభుత్వం సచివాలయాల సిబ్బందిని బీఆల్వోలు, ఇతర అధికారులుగా నియమిస్తోంది. గతంలో టీచర్లు నిర్వహించిన ఈ విధుల్ని వారికి దూరం చేసింది.  టీచర్లు బోధనేతర పనులను అప్పగించకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులను సచివాలయ సిబ్బందితోనే ప్రభుత్వం సరి పెట్టింది. ఈ విషయంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు కూడా చేశారు. పైగా,  గతంలో వద్దన్న విధులు అప్పగించి ఇప్పుడు హఠాత్తుగా తమకు నష్టం జరుగుతుందన్న భయంతో తమను ఎన్నికల విధుల నుంచి తప్పించడమేంటని టీచర్స్ సహితం ఆగ్రహంగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈసారి ఎన్నికల్ని సచివాలయాల సిబ్బంది సాయంతోనే నిర్వహించేలా వైసీపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది.
అయితే,  విజయవాడలో నిర్వహించిన తాజా సమీక్షలో సచివాలయాల సిబ్బంది ఎన్నికల విధులకు సరిపోరనే అంచనాకు వచ్చిన ఈసీ టీచర్లను సైతం ఎన్నికల విధులకు అనుమతిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. 
 
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎన్నికల విధులకు టీచర్లను తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషన్ గురువారం ఆదేశించింది. ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇతర పోలింగ్ అధికారుల నియామకానికి టీచర్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. 
 
విద్యాశాఖ పరిధిలోని టీచర్లు, బోధనేతర సిబ్బంది వివరాలను 34కాలమ్స్ ప్రొఫార్మాలో భర్తీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారులు ఈనెల 12వ తేదీ లోపు ప్రొఫార్మా, సాప్ట్, హార్ట్ కాపీలను డీఈఓ కార్యాలయాలకు అందజేయాలని తక్షణ ఆదేశాలను జారీ చేసింది.
 
దీంతో వైసీపీ ప్రభుత్వం దూరంగా ఉంచిన టీచర్లు ఇప్పుడు ఎన్నికల విధులు నిర్వహించబోతున్నారు.  సాధారణంగా ఎన్నికల సమయంలో ప్రభుత్వోద్యోగులు అనుకూలంగా ఉండాలని ఏ ప్రభుత్వమైనా కోరుకుంటుంది. కానీ ఇప్పుడు ఈసీ నిర్ణయంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఇప్పటికే రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీలో అధికారులు అధికార పార్టీ మాట విని అక్రమాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణకు వచ్చిన ఈసీ విజయవాడలో నిర్వహించిన సమీక్షలో అక్షింతలు వేసింది.  తటస్థంగా ఉంటారా లేదా అని ప్రశ్నించింది. 
 
ప్రతి అధికారి గురించిన సమాచారం తమ వద్ద ఉందని, రాజకీయ వత్తిడులకు లొంగితే తీవ్ర చర్యలు. ఓటర్ల జాబితాపై వచ్చిన ఆరోపణలపై ఎంధుకు తగిన చర్య తీసుకోలేదని అంటూ కొందరు అధికారులను వ్యక్తిగతంగా నిలదీసింది  కూడా. దీంతో కలెక్టర్లు, ఎస్పీలు ఇరుకున పడ్డారు. దీనికి కొనసాగింపుగా తాజాగా ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.