వివాదంలో నయనతార `అన్నపూరణి’ సినిమా

 
* లవ్ హిజాబ్ ను ప్రేరేపించేలా ఉందని మండిపడ్డ హిందూ సంఘాలు
లేడీ సూపర్‌స్టార్‌ నయనతార నటించిన `అన్నపూరణి’ సినిమాపై వివాదాలు మరింత ముదురుతున్నాయి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఈ సినిమా ఉందంటూ పలు హిందూ సంఘాలు చిత్ర బృందంపై మండిపడుతున్నారు. వాళ్లపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేస్తున్నారు.  ఇప్పటికే శివసేన మాజీ నేత రమేశ్‌ సోలంకి మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా, తాజాగా మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోనూ కేసు నమోదయ్యింది. 
`అన్నపూరణి’ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నయనతార, డైరెక్టర్‌ నీలేశ్‌ కృష్ణ, నిర్మాతలు జతిన్‌ సేథి, ఆర్‌ రవింద్రన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా కంటెంట్‌ హెడ్‌ మోనికా షెర్గిల్‌పై జబల్‌పూర్‌లోని ఒంటి పీఎస్‌లో కేసు నమోదైంది.  రాముడిని కించపరచడంతో పాటు లవ్‌ జిహాద్‌ను ప్రోత్సహించేలా సినిమా ఉందని హిందూ సేవా పరిషత్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేశారు.
`అన్నపూరణి’ సినిమా గత ఏడాది డిసెంబర్‌ 1వ తేదీన థియేటర్లలో విడుదల అయింది. సినిమా విడుదలైన తర్వాత 28 రోజుల్లోనే నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్‌కు వచ్చింది.  థియేటర్‌లో పెద్దగా ఈ సినిమాను చూడకపోయినప్పటికీ ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాను చూసిన పలు హిందూ సంఘాలు చిత్ర యూనిట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.  బజరంగ్‌ దళ్‌, హిందూ ఐటీ సెల్‌ ముంబైలో ఇప్పటికే ఓ కేసు కూడా పెట్టారు. 
సాధార‌ణ బ్రాహ్మ‌ణ కుటుంబంలో పుట్టిన ఓ యువ‌తి మాంసాహార వంట‌లు చేస్తూ పేరు తెచ్చుకోవ‌డంతో పాటు ఓ రెస్టారెంట్‌ను పెట్టాల‌ని క‌ల‌లు కంటూ ఉంటుంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే కొన్ని సన్నివేశాలు, సంభాషణలతో పాటు ఓ హిందూ అమ్మాయి నమాజ్ చేసినట్లుగా సినిమాలో చూపించడం లవ్ జిహాద్‌ను ప్రేరేపించేలా ఉందని, మ‌త విశ్వాసాల‌ను దెబ్బ తినేలా సినిమా ఉందంటూ కొన్ని హిందూ సంఘాలు మండిపడ్డాయి. 

థియేటర్లో విడుదలైనప్పుడు వివాదం పెద్ద‌గా ప్ర‌చారంలోకి రాక‌పోయిన‌ప్ప‌టికీ త‌ర్వాతే అస‌లు క‌థ మొద‌ల‌యింది.  సినిమాపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు రెట్టింప‌వుతూ రావ‌డంతో వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఏకంగా బాయ్‌కాట్ నెట్‌ఫ్లిక్స్ అంటూ సోష‌ల్‌మీడియా ఎక్స్‌లో టాప్‌లో ట్రెండింగ్ అయింది. అంతేకాకుండా రాముడు మాంసం తింటాడంటూ దేవుళ్ల‌ను కించపరిచే విధంగా సినిమాలో డైలాగులు ఉన్నాయంటూ విశ్వహిందూ పరిషత్  నేత‌ శ్రీరాజ్ నాయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలానే బ్రాహ్మణ అమ్మాయి మాంసాహారం వండటం వంటి స‌న్నివేశాల‌పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తు సినిమాను వెంట‌నే నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

దీంతో ఈ వివాదంపై సినిమా నిర్మాత‌లైన జీ స్టూడియోస్ ప్ర‌జ‌ల‌కు, విశ్వహిందూ పరిషత్ ల‌కు క్షమాపణలు చెబుతూ అన్న‌పూర్ణి సినిమాను నెట్‌ఫ్లిక్స్‌ నుంచి తొలగించేసింది.