షిండే వర్గానిదే అసలైన శివసేన

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నార్వేకర్‌ షాక్‌ ఇచ్చారు. అసలైన శివసేన పార్టీ తమదేనంటూ ఉద్ధవ్‌ ఠాక్రే వాదనలను తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేననే నిజమైన శివసేన అని ప్రకటించారు. 
 
షిండే వర్గానికే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారని స్పీకర్‌ స్పష్టం చేస్తూ ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలేదు. దీంతో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి ఊరట కలిగినట్లు అయ్యింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌ను స్పీకర్ రాహుల్ నర్వేకర్ తిరస్కరించారు.  అనర్హత పిటిషన్లపై బుధవారం నిర్ణయాన్ని ప్రకటించారు. 
 
పార్టీలో విభేదాలు వచ్చిన సమయంలో షిండేకు మద్దతుగా 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. నిబంధనల ప్రకారమే ఏక్నాథ్ షిండే పార్టీ నాయకుడయ్యారని తెలిపారు. ఏక్‌నాథ్ షిండే జూన్ 21న పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు. దీంతో పాటు విప్‌గా భరత్ గోగవాలే నియామకానికి స్పీకర్ చట్టబద్ధత కల్పించారు. 
 
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ తిరస్కరించారు. షిండే గ్రూపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు లేదని వెల్లడించారు. స్పీకర్‌గా తాను సెక్షన్ 10 ప్రకారం అధికార పరిధిని అమలు చేస్తున్నానని తెలిపారు. 
 
శివసేన 2018 సవరించిన రాజ్యాంగం భారత ఎన్నికల సంఘం రికార్డుల్లో లేనందున చెల్లుబాటు అయ్యేదిగా పరిగణించలేమని స్పీకర్ రాహుల్ నార్వేకర్ స్పష్టం చేశారు. శివసేన 1999 రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు తెలిపారు. 2018లో శివసేనకు ఎన్నికలు సైతం నిర్వహించలేదని ఆయన గుర్తు చేశారు. 
 
2018 సంస్థాగత నాయకత్వాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెబుతూ అసలు శివసేన ఎవరనేది అసలు సమస్య అని.. ఇరువర్గాలు అసలైన శివసేన తమదేనని చెప్పాయని గుర్తు చేశారు. ఇదిలా ఉండగా.. మహావికాస్‌ అఘాది ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే ఉద్ధవ్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. 
 
37 మంది శివసేన ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఏక్‌నాథ్‌ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా, ఉపముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ బాధ్యతలు స్వీకరించారు.శివసేన చీలిక తర్వాత రెండు వర్గాలు ఒక వర్గంపై మరొక వర్గం అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను కోరారు. ఉద్ధవ్‌ వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు షిండే వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇందులో సీఎం ఏక్‌నాథ్‌ షిండే సైతం ఉన్నారు. ఇటీవల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అసెంబ్లీ స్పీకర్‌కు సూచించింది. ఈ మేరకు రాహుల్‌ నర్వేకర్‌ నిర్ణయాన్ని వెలువరించారు.

కాగా, స్పీకర్‌ తీర్పును అంగీకరించబోమని ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. ఇది మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వ్యవహారమని ఆరోపించారు. శివసేన చీఫ్ విప్‌గా సునీల్ ప్రభు నియామకం చెల్లుబాటు అవుతుందని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టును అవమానించారని విమర్శించారు. ప్రజాస్వామ్య హత్యగా అభివర్ణించిన ఆయన, స్పీకర్‌ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని అన్నారు.