2027-28 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

2027-28 నాటికి ఐదు ట్రిలియన్‌ డాలర్లకుపైగా జీడీపీతో భారత్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవరించనుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ప్రస్తుతం 50 కోట్ల మందికి పైగా భారతీయులకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, ఈ సంఖ్య 2014 నాటికి 15కోట్లగా ఉండేదని పేర్కొన్నారు. 
 
గత ఎనిమిది తొమ్మిదేళ్లలో భారతదేశం 595 బిలియన్‌ డార్ల విదేశీ ప్రత్యక్ష పెట్టబడులను పొందిందని ఆర్థిక మంత్రి చెప్పారు.  వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ మనం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి ఆ సమయానికి మన జీడీపీ ఐదు ట్రిలియన్ డాలర్లు మించిపోతుందని తెలిపారు. 
 
 ప్రస్తుతం భారతదేశం దాదాపు 3.4 ట్రిలియన్ల డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని చెబుతూ ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీలు మాత్రమే మనకన్నా ముందున్నాయని ఆమె చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి రేటును అంచనా వేయగా, గత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.2 శాతంగా ఉందని ఆమె వివరించారు.
కేంద్రమంత్రి మాట్లాడుతూ 2023 వరకు 23 ఏళ్లలో భారత్‌కు 919 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని, ఈ ఎఫ్‌డీఐలో 65 శాతం అంటే 595 బిలియన్‌ డాలర్లు గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల్లో వచ్చాయని తెలిపారు.  ఆర్థిక సమ్మేళనాన్ని ప్రస్తావిస్తూ..  బ్యాంకు ఖాతాలు ఉన్న వారి సంఖ్య 50 కోట్లకు పెరిగిందని, అయితే 2014లో 15 కోట్ల మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలుండేవని ఆమె చెప్పారు. ప్రభుత్వం, పరిశ్రమల సమిష్టి కృషితో భారతదేశం వృద్ధిరేటుతో దూసుకుపోతోందని ఆమె తెలిపారు.

“2014 నుండి, రాష్ట్రాలు, కేంద్రం మధ్య ఉన్న విధానం సహకార సమాఖ్యవాదం, పోటీ సమాఖ్యవాదం. ఆ విధంగా 2047లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి ఎవరు ఎంతగానో సహకరిస్తారనే దానిపై రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి” అని ఆమె వివరించారు.

“ఇంతకుముందు కేంద్రం నుండి రాష్ట్రంకు అంటూ కేంద్రం `ఇచ్చేది’గా, రాస్త్రాలు `తీసుకొనేవి’గా సంబంధాలు ఉండెడివి. అందుకు అనువైన విధానాలు రూపొందిస్తుండేవారు. కానీ 2014 నుండి ఇది రాష్ట్రాలతో భాగస్వామ్యం; రాష్ట్రాలు కూడా ఆకాంక్షించేలా భాగస్వామ్యమే… కాబట్టి, నేను దీనిని కేంద్రం- రాష్ట్రాల మధ్య భాగస్వామ్యం అని పిలుస్తాను, ”అని ఆమె వివరించారు.

జాతీయ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ భారతదేశం ఇప్పుడు సెమీకండక్టర్ల అంతర్గత ఉత్పత్తిదారుగా మారుతుందని, ఎలక్ట్రిక్ వాహనాలు భారీ స్థాయిలో ఉత్పత్తి కానున్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇంకా, ఇతర అంశాలతోపాటు అధిక అమెరికా వడ్డీ రేట్ల వల్ల అంతరాయాలు ఎదురైనప్పటికీ భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం కొనసాగిందని ఆమె గుర్తు చేశారు.