
* రాజ్యసభలో ఉన్న కేంద్ర మంత్రులు ఎన్నికల్లో పోటీ
మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్‌ఘఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాల ఊపుతో 2019 ఎన్నికలతో పోలిస్తే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్ధానాల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్న బిజెపి మరో నెల రోజులలో అభ్యర్థుల జాబితాల ప్రకటనకు కసరత్తు చేస్తున్నది.
వరుసగా బిజెపి తిరిగి అధికారంలోకి రాగలదని దాదాపు అన్ని సర్వేలు స్పష్టం చేస్తుండగా ఈ పర్యాయం కేవలం మెజారిటీ స్థానాలు పొందటమే కాకుండా 50 శాతం ఓట్లతో పాటు 400 స్థానాలను కనీసం గెలుపొందాలని లక్ష్యంగా బిజెపి సంసిద్దమవుతున్నది. స్వతంత్రం తర్వాత ఇప్పటి వరకు 1984లో రాజీవ్ గాంధీ మాత్రమే 400 సీట్లను మించి గెల్చుకో గలిగారు. ఈ సారి ఆ ఘనత సాధించాలని బిజెపి పట్టుదలతో పనిచేస్తున్నది.
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి భాగస్వామ్య పార్టీల సంఖ్య తగ్గడంతో 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధిక సీట్లలో పోటీ చేయాలని బీజేపీ యోచిస్తోంది. లోక్‌సభ ఎన్నికలకు బిజెపి జనవరి లేదా ఫిబ్రవరిలో అభ్యర్ధుల జాబితాలను విడుదల చేయాలని యోచిస్తోంది. తొలి జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాధ్ సింగ్ సహా పలువురు అగ్రనేతలకు చోటు కల్పించనుంది
2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ తొలి జాబితాలో మోదీ, షా, సింగ్‌ల పేర్లున్నాయి. తొలి జాబితాలో 2019లో బొటాబొటీగా గెలిచిన, గట్టిపోటీతో బయటపడిన 164 నియోజకవర్గాల అభ్యర్ధుల పేర్లుండే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గాలపై బీజేపీ గత రెండేండ్లుగా దృష్టి కేంద్రీకరించి పార్టీ బలోపేతానికి చర్యలు చేపడుతోంది.
ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 543 స్ధానాలకు గాను 436 స్ధానాల్లో పోటీ చేసి 303 స్ధానాల్లో విజయం సాధించింది. 133 స్ధానాల్లో ఓటమి పాలైంది.
పార్టీ బలహీనంగా ఉన్న మరో 31 స్ధానాలను గుర్తించిన అగ్ర నాయకత్వం అక్కడ బలపడేందుకు కేంద్ర మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించింది. గతంలో పంజాబ్‌లో ఎస్ఏడీ, బిహార్‌లో జేడీయూ, తమిళనాడులో ఏఐఏడీఎంకే, రాజస్ధాన్‌లో ఆరెల్పీ వంటి పార్టీలతో పొత్తులో ఉండగా ప్రస్తుతం ఆయా పార్టీలతో బీజేపీ దూరం జరిగింది. దీంతో ఈసారి అధిక సీట్లలో పోటీ చేసి అత్యధిక స్ధానాల్లో విజయం సాధించేందుకు కసరత్తు సాగిస్తున్నారు.
అందుకోసం ఇతర పార్టీల నుండి క్షేత్రస్థాయిలో ప్రభావం చూపగల నేతలను ఆహ్వానించేందుకు కూడా సిద్ధపడుతున్నట్లు తెలిసింది. మంగళవారం జరిగిన కీలకమైన సమావేశంలోబీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీకి చెందిన వివిధ ప్రధాన కార్యదర్శులకు వేర్వేరు బాధ్యతలు 2024 ఎన్నికల దృష్ట్యా అప్పగించారని తెలిసింది.
ఒక జాయినింగ్ కమిటీని సిద్ధం చేశారని, దీని బాధ్యతల్ని బీజేపీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డేకు అప్పగించారని తెలుస్తోంది. ‘‘ఈ కమిటీ ఇతర పార్టీల నుండి ప్రభావవంతమైన నాయకులు, సిట్టింగ్ ఎంపీలను బీజేపీలోకి తీసుకురావడానికి గల అవకాశాలను అన్వేషిస్తుంది’’ అని ఒక నాయకుడు పేర్కొన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించే బాధ్యతను పార్టీ ప్రధాన కార్యదర్శి రాధామోహన్ దాస్ అగర్వాల్‌కు అప్పగించారు. అలాగే, ఎన్నికల ప్రచారం, ఇతర సంబంధిత పనులను సునీల్ బన్సాల్‌తో పాటు ఇతర ప్రధాన కార్యదర్శులు చూస్తారు. దుష్యంత్ గౌతమ్ దేశవ్యాప్తంగా బౌద్ధుల సదస్సులను నిర్వహించి, నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపడుతున్న పనుల గురించి వారికి వివరించనున్నారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో 21 మంది పార్లమెంట్ సభ్యులను బరిలోకి దింపిన బీజేపీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ మరో ప్రయోగానికి సిద్ధపడుతున్నట్టు తెలిసింది. మరోవంక, పలువురు రాజ్యసభ సభ్యులను లోక్‌సభ బరిలోకి దిగి తమ సత్తా చాటుకోవాలని కోరే అవకాశాలున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోనున్నది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పలువురు కేంద్ర మంత్రులు సహా 21 మంది ఎంపీలను పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దించింది. అయితే, వీరిలో 12 మంది మాత్రమే గెలుపొందారు.
నాయకులైన వారు ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగి ప్రజాతీర్పు పొందాలన్న అంశాన్ని బీజేపీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులను తమ సత్తా నిరూపించుకోవాలని కోరే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది. రాజ్యసభ ఎంపీలుగా ఉన్న కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, జ్యోతిరాదిత్య సింధియా, ధర్మేంద్ర ప్రధాన్, మన్‌సుఖ్ మాండవీయను ఆయా రాష్ర్టాల నుంచి లోక్‌సభకు పోటీ చేయించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.
More Stories
రైళ్ల పేర్లలో గందరగోళంతో ఢిల్లీలో తొక్కిసలాట!
భారతదేశ వారసులు హిందువులే
భారత్ లో ఓటింగ్‌ను పెంచేందుకు అమెరికా నిధులు?