ఆరు గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్ కమిటీ

ఆరు గ్యారంటీల అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కమిటీ ఛైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవహరించనున్నారని,  సభ్యులుగా మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తాను ఉంటామని పొంగులేటి చెప్పారు.
 
ప్రజాపాలన కార్యక్రమంపై సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష జరిపి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రజాపాలన అప్లికేషన్ల డేటా ఎంట్రీలో తప్పులు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ నెల చివరి డేటా ఎంట్రీకి పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 30 వేల మంది ఆపరేటర్లతో ఈ అప్లికేషన్ల డేటా ఎంట్రీ జరుగుతోందని పొంగులేటి చెప్పారు. 
 
 ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల్లో చెప్పామని పేర్కొంటూ 40 రోజుల్లో నెరవేరుస్తామని ఎక్కడా చెప్పాలేదని ఆయన స్పష్టం చేశారు.   తెలంగాణలో ఆరు గ్యారంటీల అమలుకు ప్రభుత్వం ప్రజాపాలన పేరిట దరఖాస్తులను డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు స్వీకరించగా 1.05 కోట్ల దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి తెలిపారు.
 
ఈ ప్రజాపాలన సజావుగా జరిగేందుకు పది ఉమ్మడి జిల్లాలు, జీహెచ్ఎంసీలోని అయిదు జోన్లకు ఒక్కొక్క సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా ప్రభుత్వం నియమించింది. కాగా, ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ నేతలకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
సంక్రాంతి పండుగ తరువాత ఇందిరమ్మ కమిటీలను వేస్తామని, ఆ కమిటీల్లో పార్టీ కార్యకర్తలనూ భాగస్వాములను చేయాలని సీఎం సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి పనులు చేయిస్తానంటూ డబ్బులు తీసుకోవడం, అవినీతికి పాల్పడడం వంటి వాటిని సహించేది లేదని, ఈ మేరకు పార్టీ నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇవ్వాలని కూడా చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే చర్యలను ఉపేక్షించబోనని రేవంత్‌ స్పష్టం చేసినట్లు తెలిసింది.