
బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా వరుసగా నాలుగోసారి, మొత్తం మీద ఐదోసారి ఎన్నిక కానున్నారు. తాజాగా ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార అవామీ లీగ్ పార్టీ మూడింట రెండొంతుల సీట్లను కైవసం చేసుకున్నది. గోపాల్‌గంజ్-3లో హసీనా ఎనిమిదో సారి ఆమె విజయం సాధించారు. 1986 నుంచి ఇక్కడ నెగ్గుతూ వస్తున్న హసీనాకు 2,49,965 ఓట్లు రాగా, బంగ్లాదేశ్ సుప్రీం పార్టీకి చెందిన నిజాముద్దీన్ లష్కర్‌కు కేవలం 469 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
76 ఏండ్ల హసీనా 2009 నుంచి వరుసగా బంగ్లాదేశ్‌లో అధికారం చేపడుతూ వస్తున్నారు. బంగ్లాదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం అయిన మాజీ ప్రధాని ఖలీదా జియా నాయకత్వంలోని బాంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) సహా దాని మిత్రపక్షాలు ఈ సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించాయి. దీంతో ఆ పార్టీలన్నీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉన్నాయి. బీఎన్‌పీ 2014 ఎన్నికలను కూడా బహిష్కరించగా, 2018 ఎన్నికలలో మాత్రం పాల్గొన్నది.
దీంతో మొత్తం 300 స్థానాలకు గానూ 299 సీట్లకు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థి చనిపోవడంతో ఒక సీటుకు ఎన్నిక జరగలేదు. మొత్తం సీట్లలో అవామీ లీగ్ 223 సీట్లను సాధించి ఘన విజయం దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం జాతీయ పార్టీ 11 సీట్లను గెల్చుకోగా, స్వతంత్రులు 62 సీట్లలో గెలుపొందారు. గెలుపొందిన వారిలో బాంగ్లాదేశ్ క్రికెట్ టీం కెప్టెన్ షకీబ్ అల్ హాసన్ కూడా ఉన్నారు. అధికార పక్ష అభ్యర్థిగా పోటీ చేశారు.
అయితే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలను నిరసిస్తూ నిరసనలు, ఆందోళనలు చేపట్టడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఘర్షణ వాతావరణ నెలకొంది. ఇక ఏకపక్షంగా జరిగిన ఈ ఎన్నికల్లో అతి తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. బంగ్లాదేశ్ ఎన్నికల అధికారుల అంచనా ప్రకారం మొత్తంగా కేవలం 42 శాతం పోలింగ్ మాత్రమే నమోదైనట్లు తెలిపారు.
బాంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ 1991లో జరిగిన తర్వాత ఇదే అత్యంత తక్కువ ఓటింగ్ శాతం. వివాదాస్పదంగా మారిన 1996 ఎన్నికలలో బాంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత తక్కువగా 26.15 శాతం ఓట్లు పోలింగ్ జరిగాయి. ఇంతకుముందు 2018 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 80 శాతం పోలింగ్ నమోదైంది.
ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా 18 చోట్ల దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. `బంగ్లా బంధు’గా పేరొందిన బాంగ్లాదేశ్ నిర్మాత షేక్ ముజిబుర్ రహమాన్ కుమార్తెగా, తండ్రితో పాటు కుటుంభం సభ్యులు అందరి సామూహిక హత్యకు గురైన తర్వాత ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మొదటిసారి 1996లో ప్రధాన మంత్రి కాగలిగారు.
వరుసగా 15 ఏళ్లపాటు ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో బాంగ్లాదేశ్ ఆర్ధిక వ్యవస్థను గణనీయంగా అభివృద్ధి చేయగలిగారు. భారత్ తో మంచి సంబంధాలు ఏర్పర్చుకున్నారు. పొరుగుదేశం మయన్మార్ లో వేధింపులకు గురవుతున్న రోహింగీయులకు ఆశ్రయం ఇవ్వడం ద్వారా అంతర్జాతీయంగా ప్రశంసలు పొందారు.
భారత దేశంతో మంచి సంబంధాలు ఏర్పర్చుకున్న షేక్ హసీనా మరోసారి ఎన్నిక కావడం, దక్షిణాసియాలో భారత్ తో బలమైన సంబంధాలున్న ఏకైక దేశం కూడా బాంగ్లాదేశ్ కావడంతో ఈ ఫలితాలు భారత్ కు సంతోషం కలిగించేవే.
More Stories
జమ్ముకశ్మీర్లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు