ప్రతి `హనుమాన్‍’ టికెట్‍పై రూ 5 `అయోధ్య’ విరాళం

ప్రతి  `హనుమాన్‍’ టికెట్‍పై రూ 5 `అయోధ్య’ విరాళం
ఈ 12న సంకురాత్రికి పలు భాషలలో విడుదల కానున్న ‘హనుమాన్‌’ సినిమాకు అమ్ముడుపోయిన ప్రతి టికెట్‌ నుంచి అయిదు రూపాయలు అయోధ్య రామమందిరానికి కానుకగా ఇవ్వనున్నట్టు నిర్మాత ప్రకటించారు.
తేజ సజ్జా హీరోగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో కె.నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్యఅతిధిగా హారాజైన మెగాస్టార్ చిరంజీవి “మా ‘హనుమాన్’ సినిమా థియేటర్లలో ఆడినన్నీ రోజులు కలెక్షన్స్ లో ప్రతి టికెట్ పై 5 రూపాయలను అయోధ్య రామమందిరానికి ఇవ్వనున్నట్లు చిత్రబృందం చెప్పారు” అని తెలిపారు.
 
‘చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయే ఘట్టం అయోధ్య రామమందిర నిర్మాణం. అటువంటి గొప్ప ఆలయ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఈ నెల 22న కుటుంబ సమేతంగా రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్య వెళ్తున్నాను’ అని ఈ సందర్భంగా చిరంజీవి వెల్లడించారు.

‘అమ్మానాన్నల తర్వాత నేను అమితంగా ఆరాధించే దైవం హనుమాన్‌. ఇది ఆయన నేపథ్యంతో కూడిన సినిమా కావడం నేను రావడానికి తొలి కారణమైతే, నా ముందు డైపర్‌లు వేసుకునే స్థాయినుంచి డయాస్‌ ఎక్కి మాట్లాడే స్థాయికి వచ్చిన తేజా ఇందులో హీరో కావడం మరొక కారణం. దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఇంకో కారణం’ అని తెలిపారు. 

హనుమ అంటే ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం అంటూ ఈ సినిమాకు థియేటర్లు తక్కువగా దొరికినా పర్లేదని పేర్కొంటూ ఇది పరీక్షా సమయం, కంటెంట్‌ బావుంటే విజయాన్ని ఎవరూ ఆపలేరని చిరంజీవి చిత్రబృందానికి భరోసా కల్పించారు. సంక్రాంతి సందర్భంగా అగ్రనటుల సినిమాలు గుంటూరు కారం (జనవరి 12), సైంధవ్ (జనవరి 13), నా సామిరంగా (జనవరి 14)  పోటీలో ఉండడంతో, తక్కువగా థియేటర్లు అందుబాటులో ఉన్నప్పటికీ `హనుమాన్’ చిత్రం నమ్మకంతో వచ్చేస్తోంది.

 ‘సినిమా తీయడం పెద్ద యుద్ధం. ఈ యుధంలో నేను వాడిన ఆయుధం తేజా. అందరూ కష్టపడి పని చేశారు. ఇది హనుమంతులవారి కథ కాదు. ఒక సామాన్యుడికి ఆంజనేయ శక్తులొస్తే ధర్మం కోసం ఎలా పోరాడాడు అనేది ఈ కథ’ అని దర్శకుడు ప్రశాంత్‌ వర్మ చెప్పారు. ధర్మం కోసం నిలబడే ప్రతీ ఒక్కరి వెనుక హనుమంతుడు ఉంటాడని హనుమాన్ చిత్రంలో డైలాగ్ ఉందని, థీమ్ కూడా అదేనని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పారు.

అలా.. ఈ సినిమా కోసం హనుమంతుడిలా చిరంజీవి వచ్చారని ప్రశాంత్ భావోద్వేగానికి గురయ్యారు.  హనుమాన్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్‍లో జనవరి 12న విడుదల కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీలోనూ విడుదల కానుంది. అలాగే, ఇంగ్లిష్, కొరియన్, జపనీస్, చైనీస్, స్పానిష్‍లోనూ విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

హనుమంతుడి వల్ల అతీత శక్తులు పొంది అన్యాయం చేసే విలన్లపై పోరాడే యువకుడి పాత్రను ఈ చిత్రంలో పోషించారు తేజ సజ్జా.  ఈ సినిమాలో  అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, గెటప్ శీను కీలకపాత్రలు చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రారంభమైన ఈ చిత్రం ట్రైలర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఎక్కువ మంది ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ బుకింగ్ విషయంలో గుంటూరు కారం మూవీని బీట్ చేసింది ఈ సినిమా.