భారత్ నిరసనతో ముగ్గురు మాల్దీవులు మంత్రుల సస్పెన్షన్

* ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలతో దుమారం
భారత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై మాల్దీవులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత్‌పై, భారత ప్రధానిపై, భారత పర్యాటకంపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరుగుతోంది. బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ ట్వీట్లు, పోస్టులతో సోషల్ మీడియా ఊగిపోతోంది. 
 
ఈ క్రమంలోనే మాల్దీవులకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్న భారతీయులు తమ టూర్‌లను రద్దు చేసుకుంటున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటకానికి పెద్ద ఎదురుదెబ్బ తగులుతోంది. మరోవైపు భారత్‌పై చేసిన వ్యాఖ్యలకు మాల్దీవులకు ఒత్తిడి పెరుగుతుండటంతో ఎట్టకేలకు అక్కడి ప్రభుత్వం స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
 
ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసిన విషయాన్ని మాల్దీవుల అధికార ప్రతినిధి ఇబ్రహీం ఖలీల్ తాజాగా వెల్లడించారు. షియూనా, మాల్షా, హసన్ జిహాన్ అనే ముగ్గురు మంత్రులపై వేటు వేసినట్లు వివరించారు.
 
 మాల్దీవుల్లో భార‌త హై క‌మిష‌న‌ర్ ఈ అంశాన్ని మ‌హ్మ‌ద్ మిజు నేతృత్వంలోని మాలే స‌ర్కార్ దృష్టికి తీసుకువెళ్లారు. మాల్దీవుల మాజీ అధ్య‌క్షుడు మ‌హ్మ‌ద్ న‌షీద్ సైతం ప్ర‌ధాని మోదీపై మంత్రి మ‌రియం షియునా అవ‌మాన‌క‌ర వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండించారు. ఆమె అస‌హ్య‌మైన ప‌దజాలం వాడార‌ని మండిపడ్డారు.  దానితో ప్ర‌ధాని మోదీని ఉద్దేశించి మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్య‌ల‌ను మాల్దీవుల ప్ర‌భుత్వం ఖండించింది. వారి వ్యాఖ్య‌ల‌తో ప్ర‌భుత్వానికి సంబంధం లేద‌ని స్ప‌ష్టం చేసింది.
 
షియూనా, మాల్షా, హసన్ జిహాన్ సోషల్ మీడియాలో నరేంద్ర మోదీతో పాటుగా భారత్‌ లక్ష్యంగా ఇష్టారీతిన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో పెద్ద దుమారం రేగడంతో మాల్దీవుల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  ఇక మాల్దీవులుకు చెందిన రాజకీయ నాయకులు చేసిన వ్యాఖ్యలకు భారతీయులు సోషల్ మీడియాలో గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు.
 
నెటిజన్లతోపాటు సినీ, క్రీడా ప్రముఖులు మాల్దీవుల పట్ల తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవులు అంటూ పోస్టులు పెడుతున్నారు. అయితే ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. 
 
సాహసాలు చేయాలనుకునే వారు తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని మోదీ సూచించారు. అయితే దాన్ని తప్పుపడుతూ భారత్‌పై, ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారు. ఇక మాల్దీవుల మంత్రి మరియం షియునా మాత్రం ప్రధాని నరేంద్ర మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేసింది. ట్విట్టర్ వేదికగా నరేంద్ర మోదీని క్లౌన్ జోకర్, తోలుబొమ్మగా అభివర్ణించడం తీవ్ర వివాదానికి దారి తీసింది.
 
గతేడాది నవంబర్ వరకు భారత్, మాల్దీవుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి. అయితే గత నవంబర్‌లో జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో భారత అనుకూల ప్రభుత్వం మారిపోయి చైనా అనుకూల, భారత వ్యతిరేక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే అప్పటినుంచి భారత్, మాల్దీవుల మధ్య సత్సంబంధాలు కాస్త చెడిపోతున్నాయి. 
 
ఈ పరిస్థితుల్లోనే మాల్దీవులకు చెందిన ఓ ఎంపీ.. చేసిన కామెంట్లు ఆ దేశానికి గట్టిగానే షాక్ ఇచ్చాయి.  భారతీయులపై ద్వేషపూరిత, జాత్యహంకార వ్యాఖ్యలు మాల్దీవులకు చెందిన రాజకీయ నాయకులు చేస్తున్నారని, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. మాల్దీవులకు అధిక సంఖ్యలో పర్యాటకులు పంపించే భారత్ పట్ల వాళ్లు ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని తెలిపారు. 
 
ఈ వ్యవహారంపై స్పందించిన నటి శ్రద్ధా కపూర్ లక్షద్వీప్‌లో అందమైన బీచ్‌లు, తీరప్రాంతాలు ఉన్నాయని, సెలవుల్లో తాను అక్కడికే వెళ్లాలని కోరుకుంటున్నానని ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఇక లక్షద్వీప్ బీచ్ వద్ద క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. అక్కడ తనకు ఉన్న అనుభవాలను పంచుకున్నారు. లక్షద్వీప్ తీరప్రాంతం మనం కోరుకునే దాని కన్నా ఎక్కువగా ఇస్తుందని తెలిపారు.


లక్షద్వీప్‌లోని అందమైన బీచ్‌ల్లో ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించడం చూసి ఆనందంగా ఉందని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తెలిపారు. లక్షద్వీప్ మన భారతదేశంలోనే ఉండటం సంతోషకరమైన విషయమని చెప్పారు. దేశంలోని సెలబ్రిటీలు అందరూ భారత్‌కు మద్దతుగా.. ట్వీట్లు చేస్తున్నారు.