‘బాయ్‌కాట్‌ మాల్దీవులు‌’ ట్రెండింగ్‌

ప్రధాని నరేంద్ర మోదీ గత వారం లక్షద్వీప్‌లో రెండు రోజుల పర్యటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన అక్కడ సముద్రంలో చేసిన సహస విన్యాసాలు, సముద్రతీరంలో సేదతీర్చుకొంటూ దిగిన ఫోటోలు అనేకమంది భారతీయులలో లక్షద్వీప్ పర్యటన పట్ల ఆసక్తి రేకెక్తిస్తున్నది. 

దీనిని చూసి ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన మాల్దీవులుకు పోటీగా లక్షద్వీప్ మారగలదనే ఆందోళనతో అక్కడి పాలకులు చేస్తున్న అనుచిత వాఖ్యలు భారతీయులలో ఆగ్రవేశాలు కలిగిస్తున్నాయి. దానితో  సోషల్‌ మీడియాలో `బాయ్‌కాట్‌ మాల్దీవులు’ హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌ (X)లో విపరీతంగా ట్రెండ్‌ అవుతున్నది. 

ప్రధాని లక్షద్వీప్ పర్యటన జరిగిన 48 గంటలలోగానే ఈ విధంగా జరగడం మాల్దీవులలో కలకలం రేపుతోంది. మాల్దీవులపై భారతీయులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నట్లు ఈ ధోరణి వెల్లడి చేస్తుంది.  ఈ క్రమంలో మాల్దీవులు, లక్ష్యద్వీప్‌ మధ్య పోలికలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లక్షద్వీప్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను సైతం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. 
 
లక్షద్వీప్‌లో పర్యటకాన్ని ప్రోత్సహించడం గిట్టని మాల్దీవుల మంత్రి అబ్దుల్లా మహమ్మద్ మజీద్ అక్కసును వెళ్లగక్కారు.  దీంతో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టూరిజంపై ఆధారపడ్డ మాల్దీవులకు భారత్‌ బలం ఏంటో తెలియదని మండిపడుతున్నారు. 
 
ఫిబ్రవరి 2న తన పుట్టిన రోజున తాను మాల్దీవులకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్నానని.. అయితే ప్రస్తుతం రద్దు చేసుకున్నట్లు ఓ యూజర్‌ పేర్కొన్నారు.  రూ.5లక్షలు చెల్లించి మూడువారాల బస చేసేందుకు హోటల్‌ను బుక్‌ చేసుకున్నానని.. మాల్దీవుల మంత్రి ట్వీట్‌ను చూసిన తర్వాత రద్దు చేసుకున్నట్లు మరో యూజర్‌ తెలిపారు. 
 
ఇదిలా ఉండగా, మాల్దీవుల మంత్రి భారత్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో 8166 హోటల్‌ బుకింగ్స్‌, సుమారు 2500 విమాన టికెట్లు రద్దయినట్లు తెలుస్తున్నది.  మాల్దీవుల మంత్రి అబుద్దల్లా మొహ్జుమ్‌ మజీద్‌ ట్విట్టర్‌లో మాల్దీవుల పర్యాటకాన్ని భారత్‌ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు.  మాల్దీవుల పర్యాటకం నుంచి కఠినమైన పోటీని ఎదుర్కొంటుందని పేర్కొన్నారు.
భారత్‌ల మౌలిక సదుపాయాల కంటే రిస్టార్‌ మౌలిక సదుపాయాల కంటే మాల్దీవుల్లోనే ఎక్కువ సదుపాయాలు ఉన్నాయంటూ ట్వీట్‌ చేశారు.  అంతటితో ఆగకుండా ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ట్వీట్‌ను ట్యాగ్‌ చేశారు. అలాగే మాల్దీవుల ఎంపీ జాహిద్‌ రమీజ్‌ లక్షద్వీప్‌లో పర్యాటకాన్ని పెంపొందించడంపై సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశారు. బీచ్ టూరిజంలో మాల్దీవులతో పోటీపడటంలో భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. 
 
అయితే ఇది మంచి అడుగు, కానీ మాతో పోటీపడడం భ్రమ అంటూ కామెంట్‌ చేశారు. మాల్దీవుల్లాంటి సేవలను భారత్‌ ఎలా అందిస్తుందని ప్రశ్నించారు. తమ దేశం అందించే సర్వీస్‌ను ఎలా అందించగలుగుతారు..? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడ గదుల్లో వచ్చే వాసన పెద్ద సమస్య’ అంటూ రమీజ్‌ ట్వీట్‌ చేశారు.
6 బిలియన్ డాలర్ల జిడిపి గల మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగమే కీలకం. అందులో భారతీయ పర్యాటకులు అక్కడి పర్యాటక రంగంకు ఆధారం. లక్షద్వీప్ ను పర్యాటకంగా భారత్ అభివృద్ధి చేస్తే తమ దేశ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోతుందనే ఆందోళన వారి మాటలలో వ్యక్తం అవుతుంది. ఇటీవల ఆ దేశ అధ్యక్షునిగా ఎన్నికైన మొహమ్మద్ ముయిజ్యూ భారత్ వ్యతిరేక, చైనా-పాకిస్తాన్ అనుకూల విధానాలు ఆవలంభిస్తుండడంతో వ్యూహాత్మకంగా ప్రధాని మోదీ రెండు రోజుల లక్షద్వీప్ పర్యటనకు వెళ్లారని ప్రచారం కూడా ఈ సందర్భంగా జరుగుతున్నది.