రాత్రి వేళ కార్గిల్‌ ఎయిర్‌స్ట్రిప్‌పై సీ-130జే ల్యాండింగ్

భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) మరో మైలురాయి సాధించింది. 8,800 అడుగుల ఎత్తులో హిమాలయ పర్వతాలపై ఉన్న జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్‌ ఎయిర్‌స్ట్రిప్‌పై రాత్రి వేళ సీ-130జే విమానాన్ని ల్యాండ్‌ చేసింది. ఒకవైపు దట్టంగా మంచుతో ఏమీ కనిపించని పరిస్థితి, మరోవైపు కొండ ప్రాంతాల వంటి సవాళ్లను ఐఏఎఫ్‌ పైలట్లు అదిగమించారు. 
 
సీ-130జే సూపర్ హెర్క్యులస్ విమానాన్ని రాత్రి వేళ కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో మొదటిసారిగా చరిత్రాత్మకంగా ల్యాండింగ్ చేశారు. ఈ మిషన్‌ ద్వారా ఈ ఘనత సాధించారు.  ఆ సమయంలో వైమానిక దళానికి చెందిన గరుడ కమాండోలు కూడా విమానంలో ఉన్నారు. కమాండోల శిక్షణలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో త్వరగా ఎలా మోహరించాలనే దానిపై ఈ కార్యక్రమం నిర్వహించారు.
 
కాగా, ఆదివారం తెల్లవారుజామున ఈ విన్యాసం నిర్వహించినట్లు భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) తెలిపింది. సవాళ్లతో కూడిన వాతావరణం, ఎత్తైన కొండ ప్రాంతాలు వంటి పరిస్థితుల్లో టెర్రైన్ మాస్కింగ్ టెక్నిక్‌ల ద్వారా ఐఏఎఫ్‌ సామర్థ్యాలను ప్రదర్శించినట్లు పేర్కొంది. కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో నైట్ ల్యాండింగ్ మిషన్‌తో మరో మైలురాయిని సాధించినట్లు వెల్లడించింది. 
 
‘ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్‌)కు చెందిన సీ-130జే విమానం తొలిసారి కార్గిల్ ఎయిర్‌స్ట్రిప్‌లో రాత్రి పూట ల్యాండ్‌ అయ్యింది. గార్డ్స్‌కు శిక్షణ కూడా ఈ మిషన్‌ కూడుకున్నది’ అని ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. ఈ మిషన్‌కు సంబంధించిన వీడియో క్లిప్‌ను ఐఏఎఫ్‌ షేర్‌ చేసింది. మార్గంలో టెర్రైన్ మాస్కింగ్‌ని ఉపయోగించడం ద్వారా ఈ వ్యాయామం గరుడ్‌ల శిక్షణా మిషన్‌ను కూడా ఉపయోగపడిందని వాయసేన పేర్కొంది.
వీడియోలో గరుడ కమాండోలతో కూడిన ప్రత్యేక దళం లైట్లు వేసుకుని లోకేషన్ ట్రాక్ చేస్తు వచ్చిన వీడియో ఆకట్టుకుంటుంది. గ్రూపు మొత్తం ఒక్కరొక్కరుగా వస్తున్న దృశ్యం ఓ సినిమాలో సీన్ మాదిరిగా అనిపిస్తుంది. ఇది చూసిన పలువురు వావ్ అని అంటున్నారు. కష్టతరమైన ఎత్తైన పరిస్థితుల్లో కూడా విమానం రాత్రి సమయంలో ల్యాండ్ చేయడం గ్రేట్ అని చెబుతున్నారు.

కార్గిల్ ఎయిర్ స్ట్రిప్ 8800 అడుగుల ఎత్తులో ఉంది. ఆ ఎత్తులో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, బలమైన గాలులు ఎక్కువగా వీస్తుంటాయి. అటువంటి పరిస్థితిలో అక్కడ ఫ్లైట్ ల్యాడ్ చేయాలంటే అధిక స్థాయి సాంకేతిక నైపుణ్యంతోపాటు శిక్షకులు కూడా అవసరం. అయితే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైమానిక దళం తన దళాలను త్వరగా మోహరించగలదని ఈ వీడియో ద్వారా ఎట్టకేలకు నిరూపించింది.

అంతకుముందు ఎయిర్ ఫోర్స్ పైలట్లు ఉత్తరాఖండ్‌లోని ధరాసులో సూపర్ హెర్క్యులస్ విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేశారు. ధరాసులో దిగిన ఆ ప్రదేశం 3000 అడుగుల ఎత్తులో ఉంది. అనూహ్య వాతావరణ మార్పులు, బలీయమైన గాలులతో పాటు అధిక ఎత్తులో పైలట్‌లు ల్యాండింగ్ ప్రక్రియలో అసాధారణమైన ఖచ్చితత్వం, నైపుణ్యాన్ని ప్రదర్శించడం అవసరమని వాయు సేన తెలిపింది. అమెరికా లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ తయారు చేసిన  సీ-130జే సూపర్ హెర్క్యులస్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానం వైమానిక దళంలోని 12వ ఫ్లీట్‌లో భాగంగా ఉంది.