జిల్లాల పునర్విభజనకై జ్యుడీషియల్‌ కమిషన్‌

* పక్షపాతం ఉండదని ప్రధాని హామీ
 తెలంగాణాలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటుచేసిన విధానంపై పునర్విచారణ చేస్తామని ముఖ్యమంత్రి ఎ రేవంత్‌రెడ్డి వెల్లడించారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదని, జిల్లాలతోపాటు మండలాలు, రెవెన్యూ డివిజన్లను కూడా అడ్డగోలుగా ఏర్పాటు చేశారని విమర్శించారు. 
 
దీనిని సరిదిద్దేందుకు జ్యుడీషియల్‌ కమిషన్‌ను నియమించి అధ్యయనం చేయిస్తామని ఆయన ప్రకటించారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించి పునర్విభజన చేపడతామని చెప్పారు. శనివారం ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’  నిర్వహించిన ‘బిగ్‌ డిబేట్‌’లో పాల్గొంటూ తన ఒక నెలరోజుల పాలన గురించి వివరించారు. 
 
‘తెలంగాణలో 33 జిల్లాల పేర్లు చెప్పలేని పరిస్థితి ఉన్నది. ప్రస్తుతం ఒక జిల్లాలో మూడు నాలుగు జడ్పీటీసీలు మాత్రమే ఉన్నాయి. జడ్పీ సమావేశం నిర్వహిస్తే ముఖముఖాలు చూసుకోవటం తప్ప మరేమీ ఉండట్లేదు. ఒక ఎంపీ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. అవి కూడా మూడు నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి’ అని గుర్తు చేశారు. 
 
ఆ ఎంపీ ఏదైనా చేయాలంటే ఆ మూడు నాలుగు జిల్లాల కలెక్ట ర్లు, ఎస్పీలతో మాట్లాడాల్సి వస్తున్నదని పేర్కొంటూ జిల్లాలు, మండలాల విభజనపై బడ్జెట్‌ సమావేశాల్లో చర్చిస్తామని తెలిపారు. దీనికోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు జడ్జితో కమిషన్‌ వేసి ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఈ కమిషన్ నియమిస్తామని, రాజకీయాలకు అతీతంగా ఈ కమిషన్‌ను నియమిస్తామని, ఈ కమిషన్‌కు పూర్తి స్వేచ్ఛను ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు.
 
ఇలా ఉండగా, ముఖ్యమంత్త్రిగా మొదటిసారి ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులను ఢిల్లీలో కలసినప్పుడు వారి స్పందన పట్ల రేవంత్ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. “ప్రధాని ఒక్కమాట మాత్రం చెప్పారు. బీజేపీ ప్రభుత్వాలు లేని సీఎంల విషయంలో పక్షపాతం ఉంటుందన్న చర్చ బయట జరుగుతుందని నేను ఆయనకు గుర్తుచేస్ అలా ఉండదని ప్రధాని చెప్పారు” అని తెలిపారు. 
 
దానికి ఉదాహరణగా రాష్ట్ర శకటాల విషయం ప్రస్తావించారు. ఉమ్మడి ఏపీ తరపున గణతంత్ర దినోత్సవం రోజు శకటం ఉండేది. తెలంగాణ వచ్చాక  ఒక్కసారి మాత్రం ఉంది. ఆ తర్వాత లేదు. వాళ్లేమో ఒక నమూనా చెబితే అలాంటిదేమీ లేకుండా తన ఇష్టారాజ్యంగా చేస్తానని, లేకపోతే లేదన్నట్లుగా కేసీఆర్‌ వ్యవహరించారని రేవంత్ చెప్పుకొచ్చారు. 
 
“నేను సీఎం అయ్యాక అధికారులను అడిగితే కేంద్రం, రాష్ట్రాల మధ్య సఖ్యత లేక అలా జరుగుతూ వచ్చిందన్నారు. ఇప్పుడు రాష్ట్రం నుంచి శకటానికి అవకాశం లేదని, మూడు నెలలు ముందుగానే నిర్ణయం జరిగిపోయిందని చెప్పారు. మేము కేంద్రాన్ని అడిగాం. కర్ణాటక విషయంలో కూడా ఏదో సమస్యతో వారి శకటానికి ఆమోదం లభించలేదు. మాకు మాత్రం లెటర్‌ పెట్టమన్నారు. కర్ణాటక లెటర్‌ పెట్టింది. ఈ రెండు లెటర్లు ప్రధాని వద్దకు వెళ్లాయి. ప్రధాని తెలంగాణకు అనుమతి ఇచ్చారు. కర్ణాటక లెటర్‌ రిజెక్ట్‌ అయింది” అంటూ వివరించారు. “మా తెలంగాణకు సంబంధించిన శకటం అక్కడ లేకపోవడమనేది మీ గౌరవానికి సంబంధించినదని ఆయన (ప్రధాని)తో అన్నాను. మీరిస్తే మేము గొప్పగా చెప్పుకొంటామని, ఇవ్వకపోతే వచ్చే సంవత్సరం ప్రయత్నిస్తామని అన్నాను. ఇప్పుడు జనవరి 26న తెలంగాణ శకటం ఉంటుంది” అని వివరించారు.  అదేవిధంగా హోంమంత్రి అమిత్‌షా వద్దకు వెళ్లి 29 మంది ఐపీఎస్‌ అధికారులను అడిగాను.

మంజూరైన పోస్టులు 79 ఉన్నాయని, ఇవి సరిపోవడం లేదని, 33 జిల్లాలు అయ్యాయని వివరించాను. 40 శాతమైనా పెంచాలని అడిగాను. ఇది ఎలా సాధ్యం? అని ఆయన ప్రశ్నించారు.  హైదరాబాద్‌లోనే 30 ఐపీఎ్‌సలను నియమించామని, నార్కోటిక్స్‌, సైబర్‌ క్రైమ్‌, టెర్రరిస్టు కార్యకలాపాలు వంటివాటిని అడ్రస్‌ చేయాలని, ఇతర కార్యకలపాలు కూడా ఉంటాయని చెప్పగానే 2024 బ్యాచ్‌ నుంచి 10 మంది ఐపీఎస్‌ అధికారులను అదనంగా ఇస్తామని చెప్పారని రేవంత్ వెల్లడించారు. 

అదేవిధంగా, ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ వద్దకు వెళ్లి లెక్కలు, కష్టాలు, అప్పులన్నీ చెప్పాను. కొత్త అప్పులొద్దు.. మీరు జోక్యం చేసుకుంటే 2, 3 శాతానికి జైకా, ఏడీబీ బ్యాంకు వంటి సంస్థలు అప్పులిస్తాయని చెప్పాను. అక్కడి నుంచి లోన్‌ తీసి, ఇక్కడికి మార్చాలని అడిగిన వెంటనే ఆమె కేంద్ర ఆర్థిక శాఖ అధికారులను పిలిచి, రాష్ట్ర అధికారులతో మాట్లాడి, పరిశీలించాలని చెప్పారు. 

ఆ తర్వాత రాజ్‌నాథ్‌సింగ్‌ వద్దకు వెళ్లాను. కంటోన్మెంట్‌ విషయాలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పాను. తన శాఖాపరమైన అంశాలను పరిశీలిస్తానని ఆయన చెప్పారు. యంగ్‌స్టర్‌కు అవకాశం వచ్చిందని, తాను కూడా 49 ఏళ్లకే యూపీ ముఖ్యమంత్రి అయ్యానని ఆయన అన్నారు.  గవర్నర్‌ వద్దకు వెళ్లి కూడా ఇదే చెప్పిన. ఇన్ని రోజుల పాటు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు వేరని చెప్పాను. రాజ్యాంగబద్ధంగా ఉన్న సంస్థలు, వీటిని అగౌరవపరిస్తే ఏమొస్తుంది? మీకున్న పెండింగ్‌ సమస్యలేమిటో మాకు చెప్పడి అని అడిగాను. ఆమె చాలా సంతోషంగా ఫీల్‌ అయ్యారు. 

హైకోర్టు చీఫ్‌ జస్టి్‌సను కలిశాను. వారికి 2009 నుంచి సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్త కోర్టు భవనం, బడ్జెట్‌ వంటి చాలా అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. డిసెంబరు 31 లోపు సమస్యలను పరిష్కరిస్తానని చెప్పాను. అన్ని సమస్యలు పరిష్కరించాం. జీవోలు ఇచ్చేశాం. రాజేంద్రనగర్‌లోని 100 ఎకరాల్లో ఒకే రూఫ్‌ కింద క్వార్టర్లు, కోర్టు నిర్మించనున్నాం. హైకోర్టు ప్రస్తుత బిల్డింగ్‌ను నల్సార్‌ యూనివర్సిటీకి ఇవ్వాలని నిర్ణయించామని రేవంత్ రెడ్డి వివరించారు.