‘ప్రజా పాలన’లో 1.25 కోట్ల దరఖాస్తులు

రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో ప్రభుత్వ పధకాల కోసం అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులోనూ ప్రధానంగా ఇళ్లు, చేయూత,   రేషన్ కార్డుల కోసం ఎక్కువగా అప్లికేషన్లు వచ్చాయి. తెల్ల కాగితంపై కూడా దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పగా ఎక్కువగా రేషన్ కార్డుల కోసం అర్జీలు వచ్చాయి. 

గత ప్రభుత్వంలో ఇచ్చిన గృహలక్ష్మి దర­ఖాస్తులను కాంగ్రెస్‌ సర్కార్ రద్దు చేయడంతో వారంతా తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చారు.

అభయహస్తం కింద తీసుకున్న దరఖాస్తుల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలు ఉన్నాయి. మహాలక్ష్మి స్కీమ్ కు మహిళలు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే రైతుబంధు కింద నిధులు తీసుకుంటున్న రైతులు  రైతు భరోసాకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో దీనికి దరఖాస్తులు తగ్గాయి.

ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీని జనవరి 17 లోపు పూర్తి చేయాలని కలెక్టర్లను ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆదేశించారు. దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి పూర్తి చేయాలని తెలిపారు. ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినందున దరఖాస్తు ఇవ్వని వారు, మరోసారి తిరిగి దారఖాస్తులు అందచేయవచ్చని తెలియజేశారు.