జ్యూడిషియల్ ఎంక్వయిరీతో కాలయాపన యత్నం

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ లో జరిగిందని పేర్కొంటూ గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు సీబీఐ విచారణ కోరి‌న‌ కాంగ్రెస్ ఇప్పుడెందుకు మౌనంగా ఉంది? అని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి  శ్రీమతి డీకే అరుణ ప్రశ్నించారు. జ్యూడిషియల్ ఎంక్వయిరీతో కాలయాపన చేయాలని చేస్తుందని ఆమె ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ పై లక్ష కోట్లకు అంచనాలు పెంచి, వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆమె ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వం తెచ్చిన జిఓ రద్దుచేసి వెంటనే సిబిఐతో విచారణ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహార శైలి చూస్తుంటే కెసిఆర్ ను కాపాడాలని చూస్తున్నారనే అనుమానం కలుగుతుందని అరుణ ఆరోపించారు.

గతంలో సిబిఐ విచారణ జరిపించాలంటూ చెప్పి సీఎం కుర్చీ ఎక్కగానే మాట మార్చారని ఆమె ధ్వజమెత్తారు.  ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ప్రాజెక్ట్ వ్యయాన్ని సుమారు రూ. 63,000 కోట్ల నుండి రూ.1.50 లక్షల కోట్లకు పెంచిందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జర్పించడం కంటే సిబిఐ విచారణ జరిపిస్తే నిజ నిజాలు బయటపడతాయని ఆమె స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దఎత్తున అవినీతికి పాల్పడిందని గతంలో రేవంత్ రెడ్డి ఆరోపించారని ఆమె గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర మంత్రులను విమర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు నిశ్వబ్దంగా ఎందుకున్నారో సమాధానం చెప్పాలని అరుణ నిలదీశారు.

మేడిగడ్డ, కాళేశ్వరం నిర్మాణం తదితర కుంభకోణాలపై దర్యాప్తు చేయించడంలో కాంగ్రెస్ జాప్యం చేస్తోందని ఆమె మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏదో స్పష్టం చేయాలని ఆమె స్పష్టం చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్టు పై 2019 జూన్ తరువాత ప్రాజెక్టులో లోపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయని చెబుతూ  2020 జూలై 9న భూపాలపల్లి జిల్లాలోని గ్రావిటీ కెనాల్‌ గోడ సిమెంట్‌ పెచ్చులూడాయని ఆమె తెలిపారు. 

లక్ష్మీ పంపుహౌస్‌ నుంచి ఆరు కిలో మీటర్ల దూరంలో గ్రావిటీ కెనాల్‌కు ఎడమవైపు సిమెంట్‌ సీలింగ్‌ పెచ్చులు ఊడిపోయాయని ఆమె చెప్పారు. 2022 జూలై 14న గోదావరిలో వచ్చిన భారీ వరదలకు కాళేశ్వరం సమీపంలోని లక్ష్మీ పంపుహౌస్‌, అన్నారం పంపుహౌస్‌ నీట మునిగాయని పేర్కొంటూ పంపుహౌ స్‌ల నీట మునుగకు ప్రధాన కారణం నిర్మాణంలో నాణ్యత, డిజైన్‌ లోపమే అనే ఆరోపణలు ఉన్నాయని అరుణ స్పష్టం చేశారు.