పశ్చిమ బెంగాల్‌లో రేషన్ కుంభకోణం రాజకీయ దుమారం రేపుతున్నది. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన అధికార టీఎంసీ కన్వీనర్ షాజాహాన్ షేక్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన సందర్భంగా అధికారులపై స్థానికులు దాడికి పాల్పడ్డారు. దీంతో అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు.
షాజాహాన్ ప్రోద్భలంతోనే ఇదంతా జరిగిందని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తమ అధికారులను చంపాలనే ఉద్దేశంతోనే ఇలా 800 నుంచి 1000 మంది మూకదాడికి పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది. వారి మొబైల్ ఫోన్‌లు, నగదు, ల్యాప్‌టాప్‌లను కూడా దుండగులు ఎత్తుకెళ్లారని వెల్లడించింది. అధికారులపై దాడికి పాల్పడిన వారి చేతుల్లో కర్రలు, రాళ్లు, ఇటుకలు ఉన్నాయని తెలిపారు.
కాగా, తాను ఇప్పటివరకు ఏ నేరం చేయలేదని షాజాహాన్ స్పష్టం చేశారు. బీజేపీ డ్రామాలో భాగంగానే ఇదంతా జరుగుతున్నదని ఆరోపించారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే చావడానికైనా సిద్ధమే అంటూ ఓ ఆడియో టేప్‌ను ఆయన విడుదల చేశారు. అసలేం జరిగిందంటే రేషన్ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు శుక్రవారం షాజహాన్ షేక్‌కు సంబంధించిన మూడు ప్రదేశాల్లో సోదాలు చేశారు.
ఓ ప్రదేశంలో సోదాలు చేస్తుండగా దాదాపు వెయ్యి మంది వరకు ఈడీ బృందంపై దాడికి పాల్పడ్డారు. ఈడీ అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. కర్రలు, రాళ్లు, ఇటుకలతో వాహనాల అద్దాలను పగుల గొట్టారు. అడ్డుకోబోయిన అధికారులపై దాడి చేశారు. వారి దగ్గర నుంచి మొబైల్ ఫోన్‌లు, నగదు, పర్సులు, ల్యాప్‌టాప్‌లను లాక్కుపోయారు. ఈ దాడిలో ముగ్గురు ఈడీ అధికారులకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అధికార పార్టీ నేత అరెస్ట్
రాష్ట్రంలో రేషన్ పంపిణీ కుంభకోణం అధికారపార్టీ నేతల్లో ఈడీ వణుకు పుట్టిస్తున్నది. పీడీఎస్ స్కామ్‌లో ఇప్పటికే టీఎంసీ నేతలను అరెస్టు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరో నాయకుడిని అదుపులోకి తీసుకున్నది. విస్తృత సోదాల అనంతరం బాంగావ్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ శంకర్ ఆధ్యాను అధికారులు అరెస్టు చేశారు.
అయితే విచారణలో సహకరించినప్పటికీ తన భర్తను అరెస్ట్ చేశారని శంకర్ సతీమణి జ్యోత్స్న తెలిపారు. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి శంకర్ అధ్యా, మరో టీఎంసీ నాయకుడు సహజాన్ షేక్ ఇండ్లల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగాల్‌లో లబ్దిదారులకు అందాల్సిన రేషన్ సరుకుల్లో నిందితులు దాదాపు 30 శాతం బహిరంగ మార్కెట్‌కు తరలించారని ఈడీ పేర్కొంది.
బెంగాల్‌లో ప్రజాస్వామ్యం అనేదే లేదు
ఇలా ఉండగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వంతో పోల్చారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం అనేదే లేదు. అక్కడ కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం ఉన్నట్టుంది. హత్య జరిగినా అక్కడది కొత్త విషయం కాదని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఇది మమతా బెనర్జీ ప్రజాస్వామ్యం’’ అంటూ ధ్వజమెత్తారు. కాగా, ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
More Stories
వక్ఫ్ జెపిసి భేటీలో ఒవైసీతో సహా 10 మంది ఎంపీల సస్పెన్షన్
కశ్మీర్‌లోని రాజౌరీలో అంతుచిక్కని వ్యాధి
భారతదేశం శక్తివంతంగా ఉండటం అంటే విధ్వంసకారిగా కాదు