చంపారన్ నుంచి ప్రధాని మోదీ బీహార్ లో ఎన్నికల ప్రచారం

మరో రెండు నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శరవేగంగా శ్రీకారం చుట్టనున్నారు. ముఖ్యంగా కీలకమైన భాగస్వామి జెడియు అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని `ఇండియా’ కూటమికి సారధ్యం వహిస్తున్న దృష్ట్యా ఈ రాష్ట్రంలో బిజెపి ప్రతిష్టాకరంగా ప్రచారం చేపడుతున్నది. 

బీహార్‌ లోని చంపారన్ నుంచి ఆయన తొలి బహిరంగ సభ మొదలుకానుంది. బేతియా సిటీలోని రామ్‌ మైదాన్‌లో జనవరి 13న తొలి ర్యాలీలో ప్రధాన ప్రసంగించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని తన పర్యటనలో భాగంగా బీహార్‌లోని పలు రోడ్లు, బ్రిడ్జిలతో సహా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు.

బీహార్‌లోని మొత్తం 40 సీట్లు గెలుచుకోవాలని బీజేపీ వ్యూహారచన చేస్తోంది. విజయమే లక్ష్యంగా జనవరి నుంచి ఫిబ్రవరి వరకూ హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పలు ర్యాలీల్లో ప్రసంగించబోతున్నారు.  జనవరి 15 తర్వాత పలు కీలక ర్యాలీలను నిర్వహించనున్నారు. 

ప్రధాని తన తొలి ప్రచార పర్యటనలో భాగంగా బెగుసరాయ్, బెట్టాయ్, ఔరంగాబాద్‌ ర్యాలీల్లో పాల్గోనున్నారు. అమిత్‌షా జనవరి- ఫిబ్రవరిలో సీతామర్హి, మథేపుర, నలందలోనూ, జేపీ నడ్డా ప్రధానంగా సీమాంచల్, బీహార్ ఈస్ట్ రీజియన్లలోనూ ప్రచారం చేయనున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీహార్ నుంచి ఎన్డీయే 39 సీట్లు, కాంగ్రెస్ ఒక సీటు గెలుచుకున్నాయి.