బిల్కిస్ బానో రేప్ కేసులో నిందితులకు క్షమాభిక్ష రద్దు

బిల్కిస్​ బానో కేసులో 11మంది దోషులను జైలు నుంచి విడుదల చేస్తూ గుజరాత్​ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ చర్యలు చేపట్టే సమర్థత గుజరాత్​ ప్రభుత్వానికి లేదని,  ఆ అధికారం మ‌హారాష్ట్ర స‌ర్కారుకు ఉంద‌ని, ఎందుకంటే అక్కడే ఆ కేసులో విచార‌ణ జ‌రిగింద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. 
 
నిందితులకు 2 వారాల సమయాన్ని ఇస్తూ ఆలోగా జైలులో లొంగిపోవాలని తీర్పులో స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో న్యాయం కోసం పోరాడుతున్న బిల్కిస్​ బానోకు విజయం లభించినట్టు అయింది. 11 మంది అత్యాచార నిందితుల విడుదలను స‌వాల్ చేస్తూ బిల్కిస్ బానో వేసిన పిటీష‌న్‌కు అర్హ‌త ఉంద‌ని సోమవారం సుప్రీంకోర్టు చెప్పింది.
 
“వాస్తవాలను తప్పుదో పట్టించి, క్షమాపణల కోసం దోషులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. క్షమాపణ అంగీకరించి, దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఎప్పుడు గుజరాత్​ ప్రభుత్వానికి చెప్పలేదు. ఇది నేరపూరత చర్య. ఈ విషయంలో బాధితురాలి హక్కును పరిగణలోకి తీసుకోవాలి. ఆ మహిళకు గౌరవం ఇవ్వాలి. దోషులను విడుదల చేసే ముందు గుజరాత్​ ప్రభుత్వం.. నాటి తీర్పును వ్యతిరేకిస్తూ రివ్యూ పిటీషన్​ని వేసుండేది. కానీ అలా చేయలేదు. దోషులను విడిచిపెట్టే సమర్థత గుజరాత్​ ప్రభుత్వానికి లేదు,” అని బిల్కిస్​ బానో కేసుల తీర్పును వెలువరించిన జస్టిస్​ బీవై నగరత్న, జస్టిస్​ ఉజ్జల్​ భవన్​లతో కూడిన సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది.

2002 గుజ‌రాత్ అల్ల‌ర్ల స‌మ‌యంలో బిల్కిస్ బానో (21) అత్యాచారంకు గురైంది. ఆ స‌మ‌యంలోనే ఆమె కుటుంబాన్ని కూడా కోల్పోయింది. అప్పటికి ఆమె 5 నెలల గర్భవతి. ఆ కేసులో శిక్ష ప‌డ్డ 11 మంది నిందితుల్ని 2022లో స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా విడుదల చేశారు. అయితే, జైలులో 14 ఏళ్లు శిక్ష అనుభ‌వించిన త‌ర్వాత విడుదల అయిన‌ట్లు గుజరాత్ హోంశాఖ కార్య‌ద‌ర్శి రాజ్ కుమార్ గ‌తంలో తెలిపారు.