దేశంలో 682కు పెరిగిన జేఎన్‌.1 కేసులు

ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా ముప్పు పెరుగుతోంది. ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కారణంగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి. నెలన్నరలోనే ఈ కొత్త వేరియంట్‌ దాదాపు 41 దేశాలకు విస్తరించింది. అమెరికా సహా సింగపూర్ తదితర దేశాల్లోనూ కేసులు పెరుగుతున్నాయి. 
 
ఇక భారత్‌లో కరోనా కొత్త వేరియంట్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా జనవరి 7వ తేదీ వరకూ దేశంలో జేఎన్‌.1 కేసులు 682కు పెరిగినట్లు సంబంధిత వర్గాలు సోవారం వెల్లడించాయి. మొత్తం 12 రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగు చూసినట్లు తెలిపాయి.  కర్ణాటకలో అత్యధికంగా 199 కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. 
 
ఆ తర్వాత కేరళలో 148, మహారాష్ట్రలో 139, గోవాలో 47, గుజరాత్‌లో 36, ఆంధ్రప్రదేశ్‌లో 30, రాజస్థాన్‌లో 30, తమిళనాడులో 26, ఢిల్లీలో 21, ఒడిశాలో మూడు, తెలంగాణలో రెండు, హర్యానాలో ఒక కేసు నమోదైంది. ఈ కొత్త వేరియంట్‌ కారణంగా కరోనా కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. 
 
అయితే, అదే సమయంలో రోజూవారీ కేసులకు సమానంగా కోలుకుంటున్న వారి సంఖ్య ఉండటం ఊరటనిస్తుంది. గత 24 గంటల వ్యవధిలో 605 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ  సోమవారం వెల్లడించింది. ఆదివారం 648 మంది కోలుకున్నారు. 
 
దీంతో మహమ్మారి నుంచి ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 44,481,341కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 4,002 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే నాలుగు మరణాలు నమోదయ్యాయి. కేరళలో ఇద్దరు, కర్ణాటక, త్రిపురలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.