టీఎస్‌పీఎస్సీలో ప్రక్షాళనా పర్వం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహకారంతోతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ప్రక్షాళన పర్వం మొదలు కానుందా..? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి వచ్చిన వినతి మేరకు.. టీఎస్‌పీఎస్సీలో కీలకమైన మార్పులు, చేర్పులకు సహకరిస్తామని.. ఛైర్మన్ మనోజ్ సోనీ, కార్యదర్శి శశి రంజన్ కుమార్ ప్రకటించారు. తమను కలిసన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఈ మేరకు వారు కీలక సలహాలు, సూచనలు అందజేశారు.

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సుదీర్ఘ కాలంగా యూపీఎస్సీ ఉద్యోగ నియామక ప్రక్రియను విజయవంతంగా చేపడుతోంది. ఎలాంటి అవకతవకలు తావు లేకుండా సమర్ధవంతంగా తమ బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణలో టీఎస్పీఎస్సీ పై అనేక ఫిర్యాదులు, విమర్శలు రావటమే కాకుండా.. ఆ సంస్థ కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తెలంగాణ యువత భవితను బుగ్గిపాలు చేసే వ్యవస్థగా తయారైంది. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన యూపీఎస్సీ సహకారాన్ని అర్ధించింది.

ఉద్యోగ నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించటంతో పాటు అవినీతి, రాజకీయ ప్రమేయానికి దూరంగా టీఎస్పీఎస్సీని ఉంచాలని USPC ఛైర్మన్ మనోజ్ సోనీ రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. ఛైర్మన్, సభ్యుల ఎంపికలో నిపుణులైన వారే ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదల దగ్గర్నుంచి.. ఉద్యోగ నియామకాల వరకు పూర్తిగా నిబంధనలు పాటించాలని, నియామక ప్రక్రియలో నూతన విధానాలను అమలు చేయాలని సూచించారు.

టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌తో పాటు సభ్యులకు తాము శిక్షణ అందిస్తామని, సిబ్బందికీ అవగాహనా తరగతులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. మొత్తం మీద తెలంగాణలో అవినీతితో భ్రష్టు పట్టిపోయిన టీఎస్పీఎస్సీ.. కనీసం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన యూపీఎస్సీ డైరెక్షన్‌లో అయినా పనితీరును మెరుగుపరుచు కోవాలని తెలంగాణ నిరుద్యోగులు, విద్యావంతులు ఆకాంక్షిస్తున్నారు.