జపాన్‌ భూకంప మృతులకు ప్రధాని మోదీ సంతాపం

జపాన్‌ ఇటీవల సంభవించిన భూకంప విషాదాన్ని మిగిల్చింది. ఈ భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన 64 మంది కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిడాకు ప్రధాని మోదీ లేఖ రాశారు. భూకంపం గురించి తెలియగానే తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ఆ లేఖలో తెలియజేశారు.

‘భూకంపంలో అయిన వాళ్లను కోల్పోయి దుఃఖంతో ఉన్న కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ ప్రకృతి విపత్తుతో తీవ్రంగా ప్రభావితమైన జపాన్‌ దేశానికి, ప్రజలకు నా సంఘీభావం ప్రకటిస్తున్నా. వ్యూహాత్మక, ప్రాపంచిక భాగస్వామిగా జపాన్‌తో బంధానికి భారత్‌ విలువనిస్తున్నది. ప్రస్తుతం తరుణంలో జపాన్‌కు అన్ని రకాల సహాయ, సహకారాలు అందించడానికి భారత్‌ సిద్ధంగా ఉన్నది’ అని కిషిడాకు రాసిన లేఖలో మోదీ పేర్కొన్నారు.

కాగా, 2024 జనవరి 1న (గత సోమవారం) సెంట్రల్‌ జపాన్‌లో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే 21 సార్లు భూమి కంపించింది. ఈ ఘటనలో ఇప్పటికే 92 మంది ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ బృందాలు సుమారు 72 గంట‌ల పాటు తీవ్రంగా అన్వేషించారు. రెస్క్యూ ఆప‌రేష‌న్ గురువారం ముగిసిపోవ‌డంతో.. 242 మంది ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభ‌మైంది.

సెల్ఫ్ డిఫెన్స్ ద‌ళాలు మిస్సైన వారి గురించి తీవ్రంగా వెతుకుతున్న‌ట్లు తెలుస్తోంది.  కూలిన ఇండ్ల కింద అనేక మంది చిక్కుకుని ఉంటార‌ని భావిస్తున్నారు. సుజు, వాజిమా ప‌ట్ట‌ణాల్లో ఎక్కువగా ఇండ్లు కూలాయి. అక్క‌డ మిస్సైన వారి సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ది. 

ఇప్ప‌టికీ ఇంకా వేలాది ఇండ్ల‌కు విద్యుత్తు, నీటి స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డం, రోడ్లు బ్లాక్ కావ‌డం వ‌ల్ల అనేక మంది దూరంగా ఉండిపోవాల్సి వ‌స్తోంది. ప్ర‌తి ఒక్క‌ర్నీ గుర్తించే వ‌ర‌కు రెస్క్యూ ఆప‌రేష‌న్ ఆగ‌దు అని జ‌పాన్ ప్ర‌ధాని ఫుమియో కిషిదా తెలిపారు. భూకంప బాధితుల కోసం ఈసారి బ‌డ్జెట్‌లో 34 మిలియ‌న్ల డాల‌ర్లు కేటాయించిన‌ట్లు జ‌పాన్ స‌ర్కారు తెలిపింది.