హైజాక్ చేసిన కార్గో షిప్‌ కాపాడిన భారతీయ కమాండోలు

* మరో వాణిజ్య నౌకపై హౌతీ రెబెల్స్‌ దాడి

ఆఫ్రికా దేశమైన సోమాలియాలో అరేబియా సముద్ర తీరంలో గురువారం ఓ కార్గో నౌక హైజాక్‌కు గురైంది. లైబీరియా జెండాతో ఉన్న కార్గో నౌక ‘ఎంవీ లిలా నార్ఫోక్‌’లో 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు. హైజాక్‌ సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది.  సముద్ర గస్తీ విధుల్లో ఉన్న ఐఎన్‌ఎస్‌ చెన్నైతో సహా మరో పెట్రోలింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌తో రంగంలోకి దిగింది.
శుక్రవారం సాయంత్రానికి హైజాక్‌ గురైన నౌక వద్దకు చేరుకొన్న అనంతరం.. భారత నేవీ కమాండోలు భారతీయ సిబ్బందితో సహా అందులో ఉన్న 21 మందిని సురక్షితంగా రక్షించారని భారత నేవీ అధికార ప్రతినిధి వివేక్‌ మధ్వాల్‌ పేర్కొన్నారు. ఆ సమయానికి నౌకను హైజాక్  చేసిన దుండగులు అందులో లేరని, అంతకుముందు చేసిన హెచ్చరికలతో పారిపోయారని కమాండోలు ధ్రువీకరించినట్టు నేవీ ఓ ప్రకటనలో పేర్కొన్నది.
నౌక హైజాక్‌కు సంబంధించి యూకే మారిటైమ్‌ ఏజెన్సీ(యూకేఎంటీవో) నుంచి భారత నేవీకి గురువారం సాయంత్రం సమాచారం అందింది.  నేవీ అధికారులు వెంటనే యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ చెన్నైతో పాటు ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూడా రంగంలోకి దింపారు. ముందుగా ఎయిర్‌క్రాఫ్ట్‌ సాయంతో నౌకలోని సిబ్బందితో కమ్యూనికేషన్‌ ఏర్పాటు చేసుకొన్నారు.
అనంతరం హైజాక్‌కు గురైన నౌక వద్దకు చేరుకొన్న ఐఎన్‌ఎస్‌ చెన్నై హెలికాప్టర్‌ను ప్రయోగించి షిప్‌ను వదిలి వేయాలని హైజాక్‌ చేసిన సముద్ర దొంగలకు హెచ్చరిక చేసిందని అధికారులు తెలిపారు. సోమాలియా తూర్పు అరేబియా సముద్ర తీరానికి 300 నాటికల్‌ మైళ్ల దూరంలో సముద్రపు దొంగలు ఈ మర్చంట్‌ నౌకను హైజాక్‌ చేశారు. ఇది బ్రెజిల్‌లోని పోర్ట్‌ డు అకో నుంచి బహ్రెయిన్‌లోని ఖలిఫా బిన్‌ సల్మాన్‌కు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం నౌకలోకి ప్రవేశించిన ఆరుగురు సాయుధ దుండగులు హైజాక్‌ చేసినట్టు తెలుస్తున్నది. 

హైజాక్‌కు గురైన వెంటనే నౌక సంబంధిత సమాచారాన్ని యూకేఎంటీవో పోర్టల్‌కు పంపింది. తర్వాత వెంటనే యూకే మారిటైమ్‌ ఏజెన్సీ అప్రమత్తం చేయడంతో భారత నేవీ ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. పెట్రోలింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ పీ81, ప్రిడేటర్‌ డ్రోన్ల సాయంతో నౌకపై నిరంతర నిఘా పెట్టింది. గత నెల గుజరాత్‌ సముద్ర తీరంలో ఒక కార్గో నౌకపై డ్రోన్‌ దాడి జరిగిన విషయం తెలిసిందే.

మరోవంక, ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం నేపథ్యంలో హమాస్‌కు మద్దతు పలుకుతున్న యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకొని వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. హౌతీలు నౌకలపై దాడులను ఆపాలని, లేకుండా తీవ్ర సైనిక చర్య ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా సహా దాని 12 మిత్ర దేశాలు హెచ్చరించాయి.  అయితే వాటిని ఏ మాత్రం పట్టించుకుని హౌతీ రెబెల్స్‌ మరోసారి వాణిజ్య నౌకలపై దాడులకు దిగింది. 
 
అయితే, యెమెన్‌ భూభాగం నుంచి ఎర్ర సముద్రంలోని నౌకలపైకి గురువారం మరోసారి డ్రోన్లను ప్రయోగించారు. ఈ డ్రోన్‌ ఎర్ర సముద్రంలోని అమెరికా నేవీ, వాణిజ్య నౌకలకు కొద్ది మైళ్ల దూరంలో పేలిందని పెంటగాన్‌ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో ఎవరూ మరణించలేదని, నష్టం జరుగలేదని పేర్కొన్నాయి.  
కాగా, దాడులు ఆపకపోతే తీవ్రమైన చర్య ఉంటాయ అమెరికా ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే 24 గంటల వ్యవధిలోనే మరోదాడి జరగడం విశేషం.
 
పేలుడుకు ముందు మానవరహిత ఉపరితల నౌక యమెన్ నుంచి అంతర్జాతీయ షిప్పింగ్ లైన్‌లలోకి వస్తుండగా దానిపై డ్రోన్లతో దాడి చేసిందని మిడిల్‌ ఈస్ట్‌లో యూఎస్‌ నావల్ ఫోర్సెస్ వైస్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ తెలిపారు. అయితే అది ఏ నౌకను లక్ష్యంగా చేసుకుందనే విషయంపై స్పష్టతనివ్వలేదు. 
 
మరోవైపు హౌతీ దాడుల నేపథ్యంలో సరకు రవాణా చార్జీలు అమాంతం పెరిగాయి. దాడుల వల్ల ప్రస్తుతం కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ గుండా వాణిజ్య నౌకలు ప్రయాణం చేస్తున్నాయి. దీంతో దూరం అధికమవడంతో రవాణా చార్జీలు కూడా అధికమయ్యాయి. ఫ్రాన్స్‌కు చెందిన సీఎంఏ-సీజీఎం సంస్థ చార్జీలను 100 శాతం పెంచడం గమనార్హం.
 
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు చేస్తున్న హౌతీ రెబల్స్‌ కు అమెరికా సహా 12 దేశాలు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చాయి. దాడులు తక్షణమే ఆపకుంటే తమ మిలటరీకి పని చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించాయి.