ఆప్ రాజ్యసభ అభ్యర్థిగా స్వాతి మాలీవాల్‌

ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ ను రాజ్యసభకు నామినేట్‌ చేస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆమెతోపాటు ఆ పార్టీ నేతలు సంజయ్‌ సింగ్‌, ఎన్డీ గుప్తాలను కూడా ఎగువ సభకు నామినేట్‌ చేస్తున్నట్లు ఆప్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ శుక్రవారం ప్రకటించింది.

‘డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ మొదటిసారిగా రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు. సంజయ్‌ సింగ్‌, నరైన్‌ దాస్‌ గుప్తాలను రెండోసారి కూడా రాజ్యసభ సభ్యులుగా కొనసాగించాలని పీఏసీ నిర్ణయించింది’ అని ఆప్‌ తెలిపింది.  ఆప్‌ నేతలు సంజయ్‌ సింగ్‌, నరైన్‌ దాస్‌ గుప్తా, సుశీల్‌ కమార్‌ గుప్తాల పదవీ కాలం ఈ నెల 27తో ముగియనుంది.

ఈ నేపథ్యంలో ఆ మూడు స్థానాలకు ఈ నెలాఖరున ఎన్నికలు నిర్వహించనున్నారు. దీంతో ఆ మూడు స్థానాలకు ఆప్‌ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో సంజయ్‌ సింగ్‌, నరైన్‌ దాస్‌ గుప్తాలకు ఆప్‌ మరోసారి అవకాశం ఇచ్చింది.

ఇక స్వాతి మొదటిసారి రాజ్యసభకు వెళ్లబోతోంది. తనను రాజ్యసభ అభ్యర్థిత్వానికి పార్టీ ఎంపిక చేయడంతో ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామె చేస్తూ స్వాతి మలివాల్‌ భావోద్వేగానికి గురయ్యారు. తోటి ఉద్యోగులను హత్తుకొని ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు.