అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయంలో ప్రతిష్ఠించే శ్రీరాముని విగ్రహం గురించి ఈ నెల 17న బహిర్గతపరుస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్టీ, ఉడుపి పెజావర్ మఠానికి చెందిన విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ తెలిపారు. బ్లాక్ స్టోన్‌తో రెండు విగ్రహాలను, గ్రానైట్ స్టోన్‌తో ఒక విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేసినట్లు తెలిపారు.
వీటిలో దేనిని రామాలయంలో ప్రతిష్ఠించాలో నిర్ణయించేందుకు ట్రస్టు సభ్యులంతా ఓట్లు వేశారని చెప్పారు. ఎంపికైన విగ్రహాన్ని సరయూ నదీ జలాలతో అభిషేకం చేస్తామని, అదే రోజున వెల్లడిస్తామని చెప్పారు. రామ జన్మభూమి అయోధ్య స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనకు సిద్ధమవుతోంది. జనవరి 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలోని గర్భాలయంలో రామ్‌లల్లాను ప్రతిష్టించనున్నారు.
ఈ వేడుకను ప్రత్యేకంగా, చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు అయోధ్యలో సన్నాహాలు మొదలయ్యాయి. శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న రామాలయం ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయిందని, మొదటి, రెండో అంతస్థులను పూర్తి చేయవలసి ఉందని చెప్పారు.
రామాలయం కనీసం 1,000 సంవత్సరాలు ఉండాలని భక్తులు కోరుకుంటారని, అందుకు అనుగుణంగానే తమ బాధ్యతలు కూడా పెరిగాయని చెప్పారు. రానున్న 4-5 నెలల్లో రోజుకు 75 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు శ్రీరాముడిని దర్శించుకునేందుకు వస్తారని అంచనా అని తెలిపారు.
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి వారం రోజుల ముందు నుంచే ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ఆచార వ్యవహారాలు ప్రారంభం కానున్నాయి. మహా మస్తకా అభిషేక కార్యక్రమాలు జనవరి 16న ప్రారంభమై, జనవరి 22 వరకు ఏడు రోజుల పాటు కొనసాగుతాయి. ఏడు రోజుల పాటు జరిగే ఉత్సవాల షెడ్యూల్‌ను ఆలయ ట్రస్టు విడుదల చేసింది.
* జనవరి 16న ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. సరయూ నది ఒడ్డున ‘దశవిధ’ స్నానం జరుగుతుంది. విష్ణు పూజ , గోదానాన్ని చేస్తారు.
* జనవరి 17న బలరాముడి రూపంలో ఉన్న రాముడి విగ్రహాన్ని నగరంలో ఊరేగిస్తారు. భక్తులు మంగళ కలశంలో నీరు నింపి ఊరేగిస్తారు
* జనవరి 18న గణేశ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ వరణం, వాస్తు పూజ వంటి ధార్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
* జనవరి 19న అగ్ని పూజ, నవగ్రహ పూజ, యజ్ఞ యాగాలను నిర్వహిస్తారు.
* జనవరి 20న, రామమందిరంలోని గర్భగుడిని సరయు పవిత్ర జలంతో శుద్ధి చేస్తారు. అనంతరం వాస్తు శాంతి, అన్నదానంతో పాటు ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
* జనవరి 21న బాల రాముని విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయిస్తారు.
* జనవరి 22న విగ్రహానికి పూజలు నిర్వహించి మధ్యాహ్నం మృగశిర నక్షత్రంలో అభిషేకం నిర్వహిస్తారు. శ్రీరామ్ లల్లా మూర్తిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠించనున్నారు.
శ్రీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాజకీయ, సినీ, క్రీడా, ఆధ్యాత్మిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. దాదాపు 4,000 మంది సాధువులతో పాటు 2,200 మంది ఇతర అతిథులకు ఆహ్వానాలు అందుకున్నారు.
ప్రముఖుల రాక నేపథ్యంలో అయోధ్యలో ఇప్పటికే ఇంటెలిజెన్స్ బృందాలు మకాం వేశాయి. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సందర్భంగా అయోధ్య ఆలయం వద్ద కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయం వద్ద నిఘా చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ‘పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా కృత్రిమ మేధతో కూడిన నిఘాను రామ మందిరం వద్ద చేపట్టనున్నాం. ఏఐ నిఘా ఉపయోగంపై కొద్ది రోజుల తర్వాత సమీక్ష జరుపుతాం. ఆ తర్వాత ఇక్కడి భద్రత, నిఘాలో భాగస్వామ్యం చేస్తాం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని పోలీస్ అధికారి చెప్పారు.
మందిరంలో అనుమానాస్పద కదలికలను ఏఐ నిఘా పసిగడుతుందని ఆయన తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రతి గడపపైనా నిఘాను ఏర్పాటు చేశారు. శ్రీరామ మందిరంలో వేడుకల నిర్వహణ సమయంలో మాత్రేమే కాకుండా భవిష్యత్తులో కూడా అయోధ్య ఆలయంలో ఏర్పాటు చేయాల్సిన భద్రత కోసం పోలీసు డేటాబేస్‌లో నేరస్తులను ట్రాక్ చేసేందుకు బ్లూప్రింట్‌ను సిద్ధం చేస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భద్రత నడుమ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
More Stories
అక్రమ వలసదారుల లెక్కలు తేలుస్తాం
సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే కాంగ్రెస్‌కు అర్థం కావట్లేదు
త్వరలోనే జీఎస్టీ రేట్లు, శ్లాబ్‌లు తగ్గింపు