2024లో 68 మంది రాజ్యసభ సభ్యుల రిటైర్మెంట్

* మన్మోహన్ సింగ్, జెపి నడ్డాలతో సహా 9 మంది కేంద్ర మంత్రులు

తొమ్మిది మంది కేంద్ర మంత్రులు సహా ఈ ఏడాది 68 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనున్నది. దీంతో దేశంలోని ప్రధాన పార్టీలన్నీ తమ బలాబలాలకు అనుగుణంగా రాజ్యసభ సీట్లు గెలుచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో గల 239 మంది సభ్యులతో 94 మందితో బిజెపి అతిపెద్ద పార్టీగా  ఉండగా, 30 మందితో కాంగ్రెస్ ఆ తర్వాత  స్థానంలో ఉంది.  తృణమూల్ కాంగ్రెస్ 13 మందితో మూడో స్థానంలో ఉంది.

 ఈ నెల 27న ఢిల్లీలోని మూడు స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) సభ్యులు సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తా, సుశీల్ కుమార్ గుప్తా, సిక్కింలోని ఎస్డీఎఫ్ సభ్యుడు హిషేయ్ లచ్చుంగ్‌ప స్థానాలకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏప్రిల్ లో ఖాళీ అయ్యే 56 స్థానాలలో 30 బిజెపి  గెలుచుకొనే అవకాశం ఉంది.

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పర్యాటకశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఆరోగ్యశాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ తో ముగుస్తుంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 10 సీట్లు, మహారాష్ట్ర, బీహర్ రాష్ట్రాల నుంచి ఆరేసీ సీట్లు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఐదు సీట్ల చొప్పున, కర్ణాటక, గుజరాత్‌లలో నాలుగేసి సీట్లు, ఒడిశా, తెలంగాణ, కేరళల్లో మూడేసీ సీట్లు, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో రెండు, ఉత్తరాఖండ్, హిమాచల ప్రదేశ్, హర్యానా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఒక్కో సీటు ఖాళీ అయ్యాయి. మరో నలుగురు నామినేటెడ్ సభ్యులు జూలైలో రిటైర్ అవుతారు.

హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బయటి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్య వహించే అవకాశాలు ఉన్నాయి. గతేడాది గెలిచిన కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి తమ సభ్యులను రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటకలో నాలుగు, తెలంగాణలో మూడు స్థానాలు ఖాళీ అవుతాయి.

మన్మోహన్ సింగ్, భూపేంద్ర యాదవ్ (రాజస్థాన్), అశ్వినీ వైష్ణవ్ (బీజేపీ), బీజేడీ సభ్యులు ప్రశాంత నందా, అమర్ పట్నాయక్ (ఒడిశా), బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి అనిల్ బాలుని (ఉత్తరాఖండ్), మాన్ సుఖ్ మాండవియా, పురుషోత్తం రూపాలా, కాంగ్రెస్ సభ్యులు నరంభాయి రథ్వా, యామీ యాగ్నిన్ (గుజరాత్) నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 

కేంద్ర మంత్రులు వీ మురళీధరన్, నారాయణ రాణె, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, కాంగ్రెస్ ఎంపీ కుమార్ కేట్కర్, ఎన్సీపీ నుంచి వందనా చవాన్, శివసేన (ఉద్దవ్ బాల్ ఠాక్రే) పార్టీ సభ్యుడు అనిల్ దేశాయి రిటైర్ అవుతారు.

రాజ్యసభలో  ఆప్,డీఎంకే లకు ప్రస్తుతం 10 మంది చొప్పున, బిజెడి, వైసిపిలు 9 మంది చొప్పున, బిఆర్ఎస్ కు 7 మంది, ఆర్జేడీకు 6 గురు, సిపిఎం, జెడియు లకు 5 మంది చొప్పున సభ్యులు ఉన్నారు. బిజెపి ప్రస్తుతం రాజస్థాన్, ఎంపీలలో గల 7 స్థానాలను తిరిగి గెల్చుకొని, పశ్చిమ బెంగాల్ లో1 స్థానం కొత్తగా గెల్చుకొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లలో ఒకొక్క సీటును తిరిగి గెల్చుకొని, హిమాచల్ ప్రదేశ్ లో 1, తెలంగాణాలో 2 కొత్తగా గెల్చుకొనే అవకాశం ఉంది. బెంగాల్ లో 4 సీట్లను టిఎంసి తిరిగి గెల్చుకుంటుంది.