భారతీయ- అమెరికన్ న్యాయ కోవిదుడు వేద్ ప్రకాష్ నందా మృతి

ప్రముఖ భారతీయ- అమెరికన్ న్యాయ కోవిదుడు, ప్రొఫెసర్ వేద్ ప్రకాష్ నందా సోమవారం అమెరికాలో కన్నుమూశారు. సాహిత్యం, విద్యకు చేసిన కృషికి పద్మభూషణ్ పురస్కారం పొందారు. అమెరికాలోని నందా కొలరాడో యూనివర్సిటీ ఆఫ్ డెన్వర్‌లో జాన్ ఎవాన్స్ విశిష్ట యూనివర్శిటీ ప్రొఫెసర్ ఆఫ్ ఇంటర్నేషనల్ వంటి ప్రతిష్టాత్మకమైన పదవిని కూడా నిర్వహించారు.
 
యూనివర్శిటీ ఆఫ్ డెన్వర్ స్టర్మ్ కాలేజ్ ఆఫ్ లాలో వేద్ నందా సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ అండ్ కంపారిటివ్ లా డైరెక్టర్‌గా ఉండటంతో పాటు ఇంటర్నేషనల్ లీగల్ స్టడీస్ ప్రోగ్రాం వ్యవస్థాపక డైరెక్టర్, డైరెక్టర్ ఎమెరిటస్‌గా యూనివర్శిటీలో బహుముఖ సేవలు అందించారు.   అమెరికాలోని డెన్వర్‌లో తుది శ్వాస విడిచిన ప్రొఫెసర్ వేద్ ప్రకాష్ నందా  మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే తాడితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
 
ఆయన సంఘ్‌లో విశిష్టమైన స్వయంసేవక్ మని, గొప్ప మానవతా విలువలు కలిగిన ఆయన జీవిత ప్రయాణం ముగిసిందని డా. భగవత్, హోసబలే నివాళులు అర్పించారు. ప్రొ. నందా, ఢిల్లీలో ప్రారంభ సంవత్సరాల్లో విద్యార్థి కార్యకర్తగా, తరువాత న్యాయశాస్త్ర ప్రొఫెసర్‌గా, తర్వాత అమెరికాలో సాగుతున్న సామాజిక జీవనంలో నేటి వరకు  విద్యార్థులకు, సమకాలీనులకు స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు.
 
న్యాయపరమైన అధ్యయనాలు, అంతర్జాతీయ చట్టం, విద్య, ప్రభుత్వ విధానాలపై విశేషమైన స్పష్టతతో ఖండాలలోని విధాన రూపకర్తలకు ఆయనను గురువుగా చేసిందని చెప్పారు. వీరిలో కొందరు అనేక దేశాలలో సుప్రీం కోర్టులు, ఉన్నత కార్యాలయాలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. భారత దేశంలోని మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌తో సహా అనేక అంతర్జాతీయ గౌరవాలు, గుర్తింపులను అందుకున్నారని వివరించారు.
 
ప్రొ. నందా ఎబివిపికి ప్రారంభ రోజులలో ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా సేవలు అందించారు. అమెరికాలో హిందూ స్వయంసేవక్ సంఘ్‌కు జోనల్ సంఘచాలక్‌గా ఆయన చేసిన సేవలు ఎల్లప్పుడూ గౌరవప్రదంగా గుర్తుండిపోతాయి. ఆయన సంస్కృతి,  న్యాయం సమస్యలపై సమానంగా ఆందోళన చెందాడని తెలిపుతూ ఆయన మరణం పట్ల డా. భగవత్, హోసబలే  ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 
 
ప్రముఖ న్యాయ పండితుడు, ప్రొఫెసర్ వేద్ ప్రకాష్ నందా మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ వేద్ ప్రకాష్ నందా కృషి న్యాయ విద్య పట్ల ఆయనకున్న దృఢ నిబద్ధతను తెలియజేస్తుందని ఆయన తెలిపారు.
 
ప్రధాన మంత్రి సోషల్ మీడియాలో తన నివాళులు ఈ విధంగా వ్యక్తం చేశారు:  “న్యాయ రంగానికి అమూల్యమైన కృతి చేసిన కృషి చేసిన ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ వేద్ ప్రకాష్ నందాజీ మరణించినందుకు తీవ్ర విచారం వ్యక్తం కలిగించింది. న్యాయ విద్య పట్ల ఆయనకు బలమైన నిబద్ధతను వెల్లడి చేస్తుంది. ఆయన అమెరికాలోని ప్రవాస భారతీయులలో ప్రముఖులు,  బలమైన భారత్ – అమెరికా సంబంధాల పట్ల మక్కువ కలిగి ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు సంతాపం తెలుపుతున్నాను”
 
హోం మంత్రి అమిత్ షా కూడా నందా మృతి పట్ల సంతాపం తెలిపారు. “అమెరికాలోని మా ప్రవాస భారతీయులకు చెందిన ప్రముఖ సభ్యుడు, భారత్ – అమెరికా బంధాన్ని బలోపేతం చేయడంలో ప్రొఫెసర్ నందాజీ చెరగని ముద్ర వేశారు” అని కొనియాడారు.
 
 అమెరికన్ లా ఇన్‌స్టిట్యూట్‌లో ఎన్నికైన సభ్యుడు. అమెరికన్ బార్ అసోసియేషన్ సెక్షన్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా అండ్ ప్రాక్టీస్‌కు కౌన్సిల్ మెంబర్‌గా పనిచేశారు. ప్రొఫెసర్ వేద్ ప్రకాష్ నందా మరణం అంతర్జాతీయ చట్టం, విద్యా రంగంలో ఒక శకానికి ముగింపు పలికింది. యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు సలహాదారునిగా పనిచేశారు. ముఖ్యంగా, యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్స్, జెనీవా  ప్రపంచ సమాఖ్యకు అమెరికా ప్రతినిధిగా,  దాని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వైస్-చైర్‌గా కూడా పనిచేశారు.