బ్యాంకులకు తిరిగి చేరిన 97.38 శాతం రూ 2,000 నోట్లు

రూ.2000 క‌రెన్సీ నోట్లు డిసెంబ‌ర్ 29వ తేదీ వ‌ర‌కు 97.38 శాతం తిరిగి బ్యాంకుల్లోకి వ‌చ్చిన‌ట్లు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్బీఐ ) ప్రకటించింది. 2023, మే 19వ తేదీన లావాదేవీలు మూసివేసిన స‌మ‌యంలో సుమారు 3.56 ల‌క్ష‌ల కోట్లు విలువ చేసే రెండు వేల నోట్లు చెలామ‌ణిలో ఉన్నాయి. 

డిసెంబ‌ర్ 29వ తేదీ వ‌ర‌కు 9,330 కోట్లు ఇంకా చెలామ‌ణిలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే 2023 మే 19వ తేదీ నాటికి అందుబాటులో ఉన్న రెండు వేల నోట్ల‌లో 97.38 శాతం నోట్లు బ్యాంకుల వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే,  2000 క‌రెన్సీ నోట్లకు ఇంకా లీగ‌ల్ గుర్తింపు ఉన్న‌ద‌ని ఆర్బీఐ వెల్ల‌డించింది.

నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ప్ర‌వేశ‌పెట్టిన 2000 నోట్ల‌ను 2023లో బ్యాంకులు వెన‌క్కి తీసుకోవ‌డం ప్రారంభించాయి. గ‌త ఏడాది అక్టోబ‌ర్ 7వ తేదీవ‌ర‌కు అన్ని బ్యాంకుల్లో రెండు వేల నోట్ల‌ను డిపాజిట్ చేశారు. అక్టోబ‌ర్ 9వ తేదీ నుంచి ఆర్బీఐ ఆఫీసుల్లో ఆ నోట్లను తీసుకుంటున్నారు. 

కొంద‌రు త‌మ వ‌ద్ద ఉన్న రెండు వేల నోట్ల‌ను ఇండియా పోస్టు ద్వారా ఇంకా పంపుతున్నారు. బ్యాంక్ అకౌంట్లోలో వారివారి మొత్తాన్ని జ‌మ చేస్తున్న విష‌యం తెలిసిందే.