మూడు నెలల కనిష్టానికి డిసెంబర్ జీఎస్టీ వసూళ్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు కొత్త రికార్డులు నెలకొల్పుతున్నాయి. 2022 డిసెంబర్ జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే, గత నెలలో వసూళ్లు పెరిగినా మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. డిసెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 10.28 శాతం పెరిగి రూ.1.65 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.
గతేడాది (2022) డిసెంబర్‌లో దాదాపు రూ.1.50 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. కానీ, గత నవంబర్‌లో వసూలైన రూ.1.68 లక్షల కోట్ల కంటే తక్కువగా గత నెలలో వచ్చాయి.  అక్టోబర్ నెలలో రూ.1.72 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అక్టోబర్ నెల వసూళ్లు రెండో గరిష్టం. ‘2022 డిసెంబర్‌తో పోలిస్తే, దేశీయ లావాదేవీలతో (సర్వీసుల దిగుమతితోపాటు) గత నెలలో రెవెన్యూ వసూళ్లు 13 శాతానికి పైగా పెరిగాయి’ అని కేంద్ర ఆర్థికశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
గత నెలలో సీజీఎస్టీ రూ.30,443 కోట్లు, ఎస్ జీఎస్టీ రూ.37,935 కోట్లు, ఐజీఎస్టీ రూ.84,255 కోట్లు (సరుకుల దిగుమతిపై సుంకం రూ.41,534 కోట్లు), సెస్ రూ.12,249 కోట్లు (సరుకుల దిగుమతితో వచ్చిన సెస్ రూ.1079 కోట్లు కలుపుకుని) వచ్చాయి.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా ఏడోసారి స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటాయి.2023-24లో డిసెంబర్ వరకు రూ.14.97 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. 2022-23తో పోలిస్తే 12 శాతం ఎక్కువ. 2022-23తో పోలిస్తే ఈ ఏడాది రూ.1.49 లక్షల కోట్లు పెరిగాయి.
కాగా, గతనెల ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్‌టీ వసూళ్లు వార్షిక ప్రాతిపదికన 11 శాతం వృద్ధి చెంది రూ.3,545 కోట్లకు చేరుకోగా.. తెలంగాణలో ఆదా యం 14 శాతం వృద్ధితో రూ.4,753 కోట్లకు పెరిగాయి.