ఎన్నికల్లో బటన్ నొక్కుతామని జగన్ కు అంగన్వాడీలఅల్టిమేటం

తమ డిమాండ్ల సాధనకై మూడు వారాలుగా ఆందోళన చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీలు తమ జీతాలు పెంచని పక్షంలో మూడు నెలల్లో జరిగే ఎన్నికలలో తాము బటన్ నొక్కుతామని అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అల్టిమేటం జారీ చేశారు. 
ముఖ్యమంత్రి జగన్ తమ వేతనాలు పెంచేలా బటన్ నొక్కాలని, లేనిపక్షంలో మూడు నెలల్లో జరగనున్న ఎన్నికలలో తాము నొక్కే బటన్ తో రాష్ట్రంలో వైసిపి అడ్రస్ లేకుండా పోతుందని అంగన్వాడి కార్యకర్తలు హెచ్చరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్వాడీలు కొత్త సంవత్సరంలో ఇళ్లల్లో ఉండాల్సిన తమను  ముఖ్యమంత్రి జగన్ ఇలా నడిరోడ్డు మీద కూర్చోబెట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాము ఇంతలా అవస్థలు పడుతున్నా సీఎం జగన్ కు తమ మీద కనికరం కలగడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష పదివేల మంది కార్యకర్తలు ఆందోళన చేస్తున్నా సీఎం జగన్ మాత్రం ఏమీ పట్టనట్టు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. సీఎం జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారని, మీ మాటలను నమ్మి ఓటేస్తే ఇలా అన్యాయం చేస్తారా? అంటూ అంగన్వాడీలు నిలదీస్తున్నారు.

ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు తమతో చర్చలు అంటూనే మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారని, ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే తాము కూడా వచ్చే ఎన్నికల్లో ప్రత్యామ్నాయం చూసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

తమ పట్ల ప్రభుత్వ వైఖరితో తీవ్ర ఆవేదన కలుగుతుందని అంగన్వాడి కార్యకర్తలు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇలా అన్ని ప్రధాన నగరాలలో అంగన్వాడీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం స్పందించకుంటే బుధవారం నుండి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడి సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.