14 ఏపీ రైల్వే స్టేషన్ల గుండా అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

ఆధ్యాత్మిక నగరి అయోధ్య వేదికగా రెండు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 30న ప్రారంభించారు. వీటితో పాటు మరో 6 వందే భారత్‌ రైళ్లకు కూడా పచ్చ జెండా ఊపారు. ప్రధాని ప్రారంభించిన రెండు అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లలో మొదటిది ఢిల్లీ – బీహార్‌లోని దర్బంగా మధ్య నడుస్తుంది.
రెండోది మాల్దా (పశ్చిమ బెంగాల్‌), బెంగళూరు మధ్య నడుస్తుంది.

రెండో అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆంధ్రప్రదేశ్‌లో 14 రైల్వే స్టేషన్లలో ఆగుతుండటం తెలుగువారికి సంతోషం కలిగించే విషయం. ఈ రైలుకు మొత్తం 32 స్టాపులు ఉండగా, వాటిలో ఏపీలోనే 14 ఉండటం విశేషం. ఒడిశాలోని బ్రహ్మాపూర్ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించే అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ 12 జిల్లాల మీదుగా ప్రయాణించి చిత్తూరు జిల్లా తర్వాత తమిళనాడులో ప్రవేశిస్తుంది. తమిళనాడు మీదుగా బెంగళూరు (కర్ణాటక) చేరుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో స్టాపులు:
1. శ్రీకాకుళం, 2. విజయనగరం, 3. విశాఖపట్నం, 4. తుని, 5. సామర్లకోట, 6. రాజమండ్రి, 7. ఏలూరు,  8. విజయవాడ, 9. తెనాలి,
10. చీరాల, 11. ఒంగోలు, 12. నెల్లూరు, 13. గూడూరు, 14. రేణిగుంట.

జనవరి 7వ తేదీ నుంచి ఈ రైలు ప్రారంభం అవుతుందని సౌత్ ఈస్టర్న్ రైల్వే తెలిపింది. 13434 నంబర్ గల అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస ప్రతి ఆదివారం మాల్దా నుంచి ఉదయం 8 గంటల 50 నిమిషాలకు ప్రారంభమవుతుంది. మూడో రోజు వేకువజామున 3 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలుకు 13433 నంబర్ కేటాయించారు.

బెంగళూరు నుంచి ప్రతి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట 50 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మూడో రోజు ఉదయం 11 గంటలకు గమ్యస్థానం ‘మాల్దా’ చేరుకుంటుంది. ఇక టికెట్ ఛార్జీల విషయానికి వస్తే సాధారణ రైళ్ల కంటే అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌‌లో టికెట్ ఛార్జీలు 15 నుంచి 17 శాతం అధికంగా ఉంటాయని రైల్వే వర్గాలు తెలిపాయి.

ఇవి నాన్‌ ఏసీ రైళ్లు. ‘పుష్’ – ‘పుల్‌’ రెండూ ఇంజిన్లూ ఉండటం ఈ రైళ్ల మరో ప్రత్యేకత.  ముందూ, వెనుకా ఉండే ఈ ఇంజిన్ల కారణంగా తక్కువ సమయంలోనే రైలు వేగాన్ని అందుకోవడంతో పాటు, ప్రయాణ సమయం ఆదా అవుతుంది. వంపు మార్గాలు, వంతెనలపై ప్రయాణం కుదుపులు లేకుండా సాఫీగా సాగుతుంది.

ఈ రైళ్లలో మొత్తం 22 కోచ్‌లు ఉండగా12 సెకండ్‌ క్లాస్‌ త్రీటైర్‌ స్లీపర్లు, 8 జనరల్‌, 2 గార్డు కంపార్ట్‌మెంట్లు ఉంటాయి. ఈ 2 కంపార్ట్‌మెంట్లలో మహిళలకు, దివ్యాంగులకు కొన్ని సీట్లను ప్రత్యేకంగా కేటాయిస్తారు. ఈ రైళ్లు గరిష్టంగా 130 కి.మీ. వేగంతో పట్టాలపై పరుగులు తీస్తాయి.