ఖతార్ కోర్టులో 3 నుండి 25 ఏళ్ళ  జైలు శిక్ష ఖరారు 

ఇజ్రాయెల్ కు గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన 8 మంది నేవీ మాజీ అధికారులకు గతంలో విధించిన మరణశిక్షను జైలు శిక్షగా మారుస్తూ ఖతార్ కోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఎనిమిది మందికి విభిన్న గడువులతో జైలుశిక్షలు విధిస్తూ శుక్రవారం తీర్పులో స్పష్టత ఇచ్చింది.  దీంతో సుదీర్ఘకాలం ఈ నేవీ మాజీ అధికారులు ఖతార్ జైళ్లలో మగ్గక తప్పేలా లేదు.
ఈ మేరకు ఖతార్ కోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చ జరుగుతోంది. ఎనిమిది మంది భారత నౌకాదళ మాజీ అధికారుల మరణశిక్షను జైలు శిక్షగా మార్చుతూ ఖతార్‌లోని అప్పీల్ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.  వీరిలో ఒక్కొక్కరికీ ఒక్కో రకంగా జైలు శిక్ష నిర్ధారిస్తూ ఇవాళ ఖతార్ కోర్టు క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ ఎనిమిది మందికి కనిష్టంగా మూడేళ్లు, గరిష్టంగా 25 ఏళ్లు జైలు శిక్ష పడింది.
ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ నిర్ధారించింది. అయితే ఈ తీర్పుపైనా అప్పీలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఖతార్‌లోని అప్పీలేట్ కోర్టు ఎనిమిది మంది మాజీ భారత నేవీ సిబ్బందికి మరణశిక్షను మూడు సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య జైలు శిక్షగా మార్చినట్లు ఓ జాతీయ వార్తా పత్రిక వెల్లడించింది.
 
మరణశిక్షలో ఉన్న ఏడుగురు మాజీ నేవీ అధికారులు, ఓ సెయిలర్ లలో ఇప్పుడు ఒకరికి 25 ఏళ్ల జైలు శిక్ష, నలుగురికి 15 ఏళ్ల జైలు, ఇద్దరికి 10 ఏళ్లు, ఒకరికి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఈ ఎనిమిది మందిలో ఏకైక నావికుడికి అత్యల్ప శిక్ష పడింది. అయితే దహ్రా గ్లోబల్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన అధికారికి కఠినమైన శిక్ష విధించారు.