అమెరికాలో భారత సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి

అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మసాచుసెట్స్‌ రాష్ట్రంలోని డోవర్‌ పట్టణంలోని తమ బంగ్లాలో భార్యాభర్తలు, 18 ఏండ్ల యువతి నిర్జీవంగా కనిపించారు. మృతులను రాకేశ్‌ కమల్‌ (57), టీనా (54), అరియానా (18)గా గుర్తించారు.  రాకేశ్‌ మృతదేహం దగ్గర తుపాకీ లభ్యం కావడంతో వీరి మరణం వెనుక పలు అనుమానాలు వస్తున్నాయి. 

రాకేశ్‌ కమల్‌ దంపతులది అమెరికాలో సంపన్న కుటుంబం. కమల్‌ స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ, బోస్టన్‌ యూనివర్సిటీ, ఎంఐటీ స్లోవాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు.  ఇక టీనా హార్వర్డ్‌ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ(ఇండియా)లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఇద్దరికీ విద్యారంగంలో అనుభవం ఉండటంతో 2016లో ఎడ్యునోవా పేరుతో ఓ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ కూడా ప్రారంభించారు.

అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా 2021లో దాని కార్యకలాపాలను నిలిపివేశారు.  ఆ కంపెనీకి టీనా కమల్ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా వ్యవహరించారు. ఈ క్రమంలోనే గత ఏడాది సెప్టెంబర్‌ 22న దివాళా పిటిషన్‌ కూడా వేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కమల్‌ దంపతులు మసాచుసెట్స్‌లో అత్యంత ధనవంతులు ఉండే ఓ ఖరీదైన ప్రాంతంలో 2019లో ఓ భవంతిని కొనుగోలు చేశాడు. 19వేల చదరపు విస్తీర్ణంలో ఉన్న ఈ భవంతిలో 11 బెడ్‌రూంలు ఉన్నాయి. 

2019లో ఈ భవంతిని 4 మిలియన్‌ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఆ భవంతి విలువ 5 మిలియన్‌ డాలర్లు(రూ.41.26 కోట్లు). ప్రస్తుతం కమల్‌ దంపతులు ఈ ఇంటిలోనే ఉంటున్నారు. ఈ దంపతుల కుమార్తె ఆరియానా వెర్మాంట్ లోని ప్రైవేట్ లిబరల్ ఆర్ట్స్ స్కూల్ మిడిల్ బరీ కాలేజీలో చదువుతోంది. 

రెండు రోజులుగా కమల్‌ దంపతుల నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేకపోవడంతో వాళ్ల బంధువు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు.  దీంతో పోలీసులు ఆ భవంతికి వెళ్లి చూడగా ముగ్గురి మృతదేహాలు లభించాయి. ఘటన సమయంలో వీరు ముగ్గురు తప్ప మరెవరూ లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. భర్త రాకేశ్ కమల్ మృతదేహం వద్ద వారికి ఒక తుపాకీ కనిపించింది. దాంతో, రాకేశ్ కమల్ తన భార్య టీనా, కూతురు ఆరియానాను తుపాకీతో కాల్చి చంపి, తరువాత తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు.

అయితే వీరి మరణానికి కుటుంబ కలహాలు? లేదా ఆర్థిక ఇబ్బందులు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే వీరి మరణానికి బయటి వ్యక్తులతో సంబంధం ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.