క్రికెట్ చ‌రిత్ర‌లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 76 పరుగులు చేయడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా ఈ కేలండర్ ఏడాదిలో కోహ్లి 2 వేల పరుగులు పూర్తి చేశాడు. ఇలా ఒకే కేలండర్ ఏడాదిలో 2 వేల పరుగులు చేయడం కోహ్లికి ఇది ఏడోసారి కావడం విశేషం.
146 ఏళ్ళ క్రికెట్ చరిత్రలో 1877 నుంచి మొదలైన అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ క్రికెట‌ర్‌గా కూడా ఇటువంటి ఘనత సాధింపలేదు. దక్షిణాఫ్రికా ఆడుతున్న తొలి టెస్టులో విరాట్ మొదటి ఇన్నింగ్ 38, రెండు ఇన్నింగ్స్ లో 76 పరుగులు చేశారు.  దీంతో 2023లో కోహ్లి మొత్తం పరుగుల సంఖ్య 2006కు చేరింది. ఇంతకుముందు కూడా అతడు ఈ ఫీట్ ను ఆరుసార్లు అందుకున్నాడు.
 2012లో 2186 ప‌రుగులు, 2014లో 2286 ర‌న్స్‌, 2016లో 2595 ర‌న్స్‌, 2017లో 2818 ర‌న్స్‌, 2018లో 2735 ర‌న్స్‌, 2019లో 2455 ర‌న్స్ చేశాడు. 
శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర్ ఆరు క్యాలెండర్ ఇయర్‌లలో 2000 కంటే ఎక్కువగా పరుగులు చేశారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్థనే ఐదు సార్లు చేశారు. మాథ్యూ హేడెన్, సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్ నాలుగు సార్లు ఈ ఘనత సాధించారు.

అయితే ఇంతటి చారిత్రక ఇన్నింగ్స్ చివరికి వృథాగా మారి ఇండియా ఇన్నింగ్స్ ఓటమి పాలైంది. రెండు టెస్టుల సిరీస్ లో సౌతాఫ్రికా 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ ఓటమితో సౌతాఫ్రికా గడ్డపై ఈసారి కూడా టెస్ట్ సిరీస్ గెలిచే అవకాశం లేకుండా పోయింది. 

సెంచూరియన్ లో జరిగిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లలో దారుణంగా విఫలమైంది రోహిత్ సేన. తొలి ఇన్నింగ్స్ లో రాహుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్ లో కోహ్లి హాఫ్ సెంచరీ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఓటమితో డబ్ల్యూటీసీ పాయింట్ల టేబుల్లో ఇండియా టాప్ నుంచి ఐదో స్థానానికి పడిపోయింది.  అంతేకాదు మ్యాచ్‌లో మ‌రీ నెమ్మ‌దిగా బౌలింగ్ చేసిన రోహిత్ సేన‌కు జ‌రిమానా విధించడంతో పాటు ఐసీసీ వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్‌షిప్‌లో కీల‌క‌మైన రెండు పాయింట్ల‌ను కూడా టీమిండియా కోల్పోయింది.

సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు రెండు ఓవ‌ర్లు త‌క్కువ‌గా బౌల్ చేసింది. స్లో ఓవ‌ర్ రేటు కార‌ణంగా టీమిండియాకు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు.  నిర్ణీత స‌మ‌యంలోగా ఓవ‌ర్ల కోటాను పూర్తి చేయ‌కుంటే, ఆర్టిక‌ల్ 2.22 ఐసీసీ ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి కింద ఆట‌గాళ్ల‌పై 5 శాతం ఫీజు కోత విధిస్తారు.