ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 ముప్పు

కరోనా వైరస్‌లో ముట్యేషన్స్‌ మారుతున్నట్లుగా పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఫలితంగా ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 ప్రపంచవ్యాప్తంగా ప్రమాదాన్ని మరోసారి పెంచుతున్నది. కొత్త వేరియంట్‌ అంత ప్రమాదమేమి కాకపోయినప్పటికీ వేగంగా వ్యాప్తి చెందుతుండడం కారణంగా ముప్పు పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు.

ఒమిక్రాన్‌ వేరియంట్ల తరహాలోనే వ్యక్తుల శరీరంలోకి వేగంగా ప్రవేశించగలదని, వ్యాధి నిరోధక వ్యవస్థను తప్పించుకుంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల చైనా, సింగపూర్‌, అమెరికా, భారత్‌ సహా పలు దేశాల్లో జేఎన్‌.1 వేరియంట్‌ కేసులు వెలుగు చూశాయి. కొన్ని దేశాల్లో వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే జేఎన్‌.1ను వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌గా వర్గీకరించింది.  అమెరికాలో కరోనా కేసుల పెరుగుదలకు జేఎన్‌.1 వేరియంటే కారణమని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం డిసెంబర్ మధ్య నాటికి, దేశవ్యాప్తంగా 44 కోవిడ్ కేసులకు ఈ వేరియంట్ కారణం. నవంబర్‌లో వేరియంట్‌ ప్రభావం 7శాతం ఉండగా, నెలలోనే భారీగా కేసులు పెరిగాయి.

యూఎస్‌ వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌లోని ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ విలియం షాఫ్నర్ మాట్లాడుతూ వేరియంట్‌తో కేసులు పెరిగేందుకు సమయం పడుతుందని.. ఒకసారి ఊపందుకుంటే విస్తృతంగా వ్యాపిస్తుందని చెప్పారు.  వేరియంట్ వేగంగా పెరిగిన సమయంలో ఇన్‌ఫెక్షన్ వేగాన్ని వేగవంతం చేయడమే కాకుండా రాబోయే కొద్ది నెలల్లో కొత్త ఉత్పరివర్తనలు, కొత్త వేరియంట్ ప్రమాదం సైతం పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ప్రస్తుతం జేఎన్‌.1 వేగాన్ని నియంత్రించడంపై దృష్టి పెట్టడం ముఖ్యమని పేర్కొన్నారు. సీడీసీ నివేదిక ఇటీవల కొవిడ్‌ ప్రమాదంపై హెచ్చరించారు. వృద్ధులకు, శిశువులకు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వారికి సోకితే ప్రమాదకరంగా ఉంటుందని హెచ్చరించారు. 

చాలా సందర్భాల్లో జేఎన్‌.1 వేరియంట్‌ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు తక్కువ ఉన్నప్పటికీ.. దాన్ని తేలిగ్గా తీసుకొని తప్పు చేయకూడదని నిపుణులు పేర్కొంటున్నారు. జేఎన్‌.1 వేరియంట్‌ కారణంగా చైనా మరణాలు పెరిగినట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి.  అయితే, మరణాలు కరోనాతో సంబంధం ఉందా? లేదా ? అనేది అధికారులు ధ్రువీకరించడం లేదు. వృద్ధులే కాకుండా యువకులు, పిల్లలు సైతం కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోగ్య అధికారి ఒకరు పేర్కొన్నారు. కరోనా మరణాలతో చైనాలో పరిస్థితి భయానకంగా మారుతున్నది.