తెలంగాణలో ప్రజాపాలనకు విశేష స్పందన

హైదరాబాద్, డిసెంబర్ 29 ( నిజం టుడే ) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమానికి తొలిరోజు మంచి స్పందన కనిపించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలు, గ్రామాల్లో ప్రభుత్వ గ్యారంటీల దరఖాస్తుల కోసం ప్రజలు బారులు తీరారు. రాజధాని భాగ్యనగరంలో అయితే ఈ సందడి మరీ ఎక్కువగా కనిపించింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్ళకై ప్రజల నుంచి భారీగా దరఖాస్తులు అందాయి.

రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజే సుమారు 7.46 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. జనవరి 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని.. అర్హులైన ప్రజలంతా ప్రభుత్వ పథకాలకై దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. రంగారెడ్డి జిల్లా మెట్‌పల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. తెలంగాణ ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా భట్టి పేర్కొన్నారు.

మరోవైపు.. దరఖాస్తుదారుల్లో ఎక్కువ శాతం మంది మహిళలే కనిపించారు. గ్రామ, వార్డు, డివిజన్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లన్నీ కిక్కిరిసి పోయాయి. జిరాక్స్ సెంటర్లు, మీసేవా కాంద్రాలు, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ల దగ్గర కూడా పెద్ద సంఖ్యలో జనం బారులు తీరారు. మొత్తం మీద.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత హామీలను పొందేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఎదురు చూస్తున్నారు.