‘ఇళ్ల ధరల్లో’ ముంబై తర్వాత భాగ్యనగరమే

అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ భారత్ లో గృహ విపణి రంగంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలకు సంబంధించి రెండో ఖరీదైన నగరంగా హైదరాబాద్ నిలిచింది. నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన అఫర్డబుల్ ఇండెక్స్ లో ఈ విషయాన్ని పేర్కొంది. ఆదాయంలో ఇంటి రుణం ఈఎంఐ చెల్లించే నిష్పత్తి ఆధారంగా ఈ సూచీని రూపొందిస్తారు. హైదరాబాద్ లో 2023లో ఇళ్ల ధరలు 11 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ఇక ఈ జాబితాలో వాణిజ్య రాజధాని ముంబై తొలి స్థానంలో నిలిచింది.

ఇక వివిధ నగరాల్లో ఇళ్ల ధరల విషయానికొస్తే.. ముంబై కొనుగోలుదార్ల ఆదాయంలో 51 శాతం వరకు ఈఎంఐకి చెల్లించాల్సి వస్తోంది. హైదరాబాద్ లో ఇది 30 శాతం ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో 27 శాతం, బెంగళూరులో 26 శాతం, చెన్నైలో 25 శాతం, పూణేలో 24 శాతం, కోల్ కతాలో 24 శాతం, అహ్మదాబాద్ లో 21 శాతం మేర చెల్లింపులు జరపాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇళ్ల కొనుగోలు శక్తి పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది.