డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కాంత్ మృతి

డీఎండీకే అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కాంత్ (71) మృతి చెందారు. తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయ్ కాంత్‌ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాట్ ఆసుపత్రికి తరలించారు.  గురువారం ఉద‌యం 9 గంట‌ల స‌మ‌యంలో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న క‌న్నుమూసిన‌ట్లు ఆస్ప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించారు.
 
రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన గురువారం మృతి చెందినట్టు తమిళనాడు ఆరోగ్యశాఖ వెల్లడించింది. రెండు రోజుల క్రితం విజయ్ కాంత్ నిమోనియాతో ఆసుపత్రిలో చేరారు.  విజయ్‌కాంత్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన పరిస్థితి విషమించడంతో నేడు తుది శ్వాస విడిచారు.
విజయకాంత్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో ఆసుపత్రిలో చేరారని, వెంటిలేటర్ పై ఉంచారని దేశీయ ముర్పోక్కు ద్రవిడ కళగం తన అధికారిక హ్యాండిల్ లో పోస్ట్ ద్వారా ఆయన పార్టీ తెలియజేసింది.
 ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో చెన్నైలోని మియోట్‌ దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుని డిసెంబర్‌ 11న ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పుడే ఆయన మరణించారనే వార్తలు నెట్టింట షికారు చేశాయి.  అయితే ఆ వదంతులను ఆయన సతీమణి ప్రేమలత కొట్టిపారేశారు.
అయితే రెండు వారాలు గడువకముందే ఆయన కరోనా బారినపడటం, మరోసారి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. విజయ్ కాంత్ 1952 ఆగస్ట్ 25న మధురైలో జన్మించారు.  విజ‌య‌కాంత్ అస‌లు పేరు నారాయ‌ణ‌న్ విజ‌య‌రాజ్ అళ‌గ‌ర్ స్వామి. 27 ఏండ్ల వ‌య‌సులో తెరంగ్రేటం చేసి 2015 వ‌ర‌కు నిర్విరామంగా న‌టించారు. 
 
ఇనిక్కుం ఇలామైతో న‌టుడిగా విజ‌యకాంత్ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టారు. సుమారు 150కి పైగా చిత్రాల్లో న‌టించి, మెప్పించారు. అటు త‌మిళ‌, ఇటు తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించారు. దాదాపు 20కి పైగా పోలీసు క‌థ‌ల్లోనే ఆయ‌న న‌టించి మెప్పించారు.  కెరీర్ ఆరంభంలో కాస్త ప‌రాజ‌యాలు అందుకున్న విజ‌య‌కాంత్.. ఎస్ఏ చంద్ర‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన దూర‌తు ఇడి ముళ‌క్కం, స‌త్తం ఒరు ఇరుత్త‌రై సినిమాల‌తో విజ‌యాలు అందుకున్నారు. 100వ చిత్రం కెప్టెన్ ప్ర‌భాక‌ర్ విజ‌యం సాధించిన త‌ర్వాత నుంచి అంద‌రూ ఆయ‌న్ని కెప్టెన్‌గా పిలుస్తున్నారు. 
 
ఇక విజ‌య‌కాంత్ న‌టించిన చాలా చిత్రాలు తెలుగులోనూ డ‌బ్ కావ‌డంతో ఇక్క‌డి వారికీ ఆయ‌న సుప‌రిచితులే. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే ఉద్దేశంతో ఆయ‌న రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. 2005 సెప్టెంబర్ 14న డీఎండీకే పార్టీని విజయ్ కాంత్ స్థాపించారు. 2006లో తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
ఈ పార్టీ మ‌ధురైలో పురుడు పోసుకుంది. 2006లో జ‌రిగిన తమిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో డీఎండీకే అన్ని స్థానాల్లో పోటీ చేసింది. కానీ విజ‌య‌కాంత్ ఒక్క‌రే నాటి ఎన్నిక‌ల్లో గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మ‌ళ్లీ 2011 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపొందారు.  2011-16 మధ్య త‌మిళ‌నాడు అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా కొన‌సాగారు. 2006లో విరుధ‌చ‌లం, 2011లో రిషివండియం నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఆయ‌న అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హించారు. ఇలా న‌టుడు, పొలిటీషియ‌న్‌గా కాకుండా నిర్మాత‌, ద‌ర్శ‌కుడిగానూ పేరు తెచ్చుకున్నారు.

2011 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకేతో క‌లిసి పోటీ చేశారు. 41 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేశారు. 29 స్థానాల్లో గెలుపొంది, ప్ర‌తిప‌క్ష హోదాను పొందారు. నాటి ఎన్నిక‌ల్లో డీఎంకేను ఓడ‌గొట్టేందుకు డీఎండీకే, అన్నాడీఎంకే క‌లిసి తీవ్రంగా శ్ర‌మించాయి.  2014 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా డీఎండీకే, బీజేపీతో జ‌త‌క‌ట్టింది. ఆ స‌మ‌యంలో డీఎండీకేకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తూ స్పీక‌ర్‌కు లేఖ‌లు అంద‌జేశారు. దాంతో డీఎండీకే ప్ర‌తిప‌క్ష హోదాను కోల్పోయింది.