రాహుల్ గాంధీ జనవరి 14 నుంచి భారత్ న్యాయ యాత్ర

* మీరేం న్యాయం చేస్తారు రాహుల్?.. బిజెపి ఎద్దేవా

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సారథ్యంలో జనవరి 14వ నుంచి భారత్ న్యాయ యాత్ర కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. మణిపూర్ నుంచి ఆరంభమై ఈ యాత్ర ముంబై వరకూ 67 రోజుల పాటు జరుగుతుంది. మార్చి 20న ముగుస్తుంది. రాహుల్ యాత్ర 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల మీదుగా సాగుతుంది. 

గతంలో రాహుల్ దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర తరువాత తిరిగి ప్రజలతో మమేకం దిశలో ఆయనతో కాంగ్రెస్ తలపెట్టిన విస్తృత కార్యక్రమం ఇదే. తూర్పు భారతం నుంచి పడమర భారతం వరకూ ఈ భారత్ న్యాయ యాత్ర సాగుతుంది.  వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ను మరింతగా ప్రజల వద్దకు చేర్చేందుకు, పలు ప్రాంతాల్లో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, వారికి న్యాయంపై భరోసా కల్పించేందుకు ఈ యాత్ర తలపెట్టినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు.

న్యాయ యాత్ర బస్సులు, కాలినడకన సాగుతుంది. ఇంఫాల్‌లో జనవరి 14న ఈ యాత్రకు కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే పచ్చజెండా చూపి ప్రారంభిస్తారు. నాగాలాండ్, అసోం, మేఘాలయా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ , ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ , గుజరాత్, మహారాష్టల మీదుగా ఈ పర్యటన సాగుతుంది.

సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దేశ ప్రజలందరికి వెలువరించడం ఈ యాత్ర కీలక అంశం అని చెప్పారు. ఈ నెల 21న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ యాత్రకు అంకురార్పణం జరిగిందని పార్టీ సంస్థాగత విషయాల ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ మీడియాకు తెలిపారు.

కాగా, రాహుల్ చేపట్టే భారత్ న్యాయ యాత్రను బిజెపి తేలిగ్గా తీసిపారేసింది. ఇది ఉత్తి నినాద ఆర్భాట తంతు, ఇటువంటి వాటితో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టలేదు. మోసగించలేదు అని కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖి స్పష్టం చేశారు. ఏ ఉద్ధేశంతో రాహుల్ ఆధ్వర్యంలో న్యాయం పేరిట యాత్ర తలపెట్టారు? అని ఆమె ప్రశ్నించారు. 

 ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు తగు విధంగా న్యాయం చేస్తోందని, ప్రగతి సమపంపిణీకి దారులు ఖరారు చేసిందని ఆమె పేర్కొన్నారు. దేశంలో ఏళ్ల తరబడి అధికారం పాతుకుని పేర్కొంటూ సాగిన కాంగ్రెస్ హయాంలో ప్రజలకు ఏం న్యాయం దక్కిందని ఆమె  ప్రశ్నించారు. 

ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ద్వారా ప్రజలకు ఏం జరుగుతుందని ఆమె నిలదీశారు. ప్రత్యేకించి దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలడం, నిరర్థక ఆస్తుల పేరిట భారీ రుణాల మంజూరీతో బ్యాంకు రుణాల విషయంలో పూర్తి స్థాయి దగా తప్ప ఏం ఒరిగిందని ఆమె ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో అన్నింటా అన్యాయమే జరిగిందని ఆమె ధ్వజమెత్తారు.