చంద్రబాబు రెండు చోట్ల నుండి పోటీ!

 
* లోకేష్ హిందూపూర్, బాలకృష్ణ గుడివాడ
 
టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సారిగా వచ్చే ఎన్నికల్లో రెండు చోట్ల నుండి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో పాటు ఉత్తరాంధ్రలోని మరో నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నట్లు చెబుతున్నారు. ఆయన భీమిలి నుండి పోటీ చేయవచ్చని చెబుతున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీకి సానుకూలంగా మార్చుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
 
అదేవిధంగా గత ఎన్నికల్లో రెండు చోట్ల నుండి పోటీ చేసి, రెండు చోట్ల కూడా ఓటమి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సారి కూడా రెండు చోట్ల నుండి పోటీ చేయనున్నారు. అయితే, గతంలో పోటీ చేసిన భీమవరంతో పాటు తిరుపతి నుండి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. తిరుపతిలో పోటీ చేయడం ద్వారా రాయలసీమలో ప్రభావం చూపవచ్చని టిడిపి అధినేత భావిస్తున్నట్లు చెబుతున్నారు.
 
ఇక వరుసగా రెండు సార్లు హిందూపురం నుండి గెలుపొందిన నందమూరి బాలకృష్ణ ఈ పర్యాయం తన నియోజకవర్గం మార్చి గుడివాడ నుండి పోటీ చేయనున్నట్లు తెలుస్తున్నది. టిడిపి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఓడించలేకపోతున్న మాజీ మంత్రి, వైసిపి నేత కొడాలి నానిని ఓడించడం కోసం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
 
అదేవిధంగా నారా లోకేష్ కూడా గత ఎన్నికలలో పోటీచేసి ఓటమి చెందిన మంగళగిరి నుండి కాకుండా టిడిపికి కంచుకోటగా ఉన్న హిందూపురం నుండి పోటీ చేయనున్నారు. మంగళగిరిలో లోకేష్ ను ఓడించడంకోసం రెండు సార్లు వరుసగా గెలుపొందిన ఆళ్ళ రామకృష్ణారెడ్డిని పక్కనపెట్టి చేనేత వర్గంపై చెందిన నేతకు సీటు ఇచ్చేందుకు వైసిపి నిర్ణయించడంతో టిడిపి కూడా అదే సామాజికవర్గం నేతను రంగంలోకి దింపేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.
ఎన్నికల పొత్తుకు సిద్దమైన టిడిపి, జనసేన పార్టీలు ఉమ్మడి వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకొంటున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల చంద్రబాబును కలిసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాలు ఈ నిర్ణయం వెనుక ఉన్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధీటుగా సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తామని ప్రచారంపై పోకుండా అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి కల్పన, యువత, శాంతిభద్రతలు వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారింపమని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు చెబుతున్నారు.
 

పార్టీలో వివిధ జిల్లాలో ప్రాబల్యం వహిస్తున్న సీనియర్లను కట్టడి చేసేందుకు `ఒకే కుటుంబం- ఒకే సీట్’ అనే విధానం కూడా తీసుకొస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.  ఈ మొత్తం ఎత్తుగడలో లోకేష్ కు సురక్షితమైన నియోజకవర్గం ఎంచుకోవడమే కారణంగా కనిపిస్తున్నదని పరిశీలకులు భావిస్తున్నారు. పైగా, లోకేష్ భవిష్యత్ లో రాయలసీమలో ప్రభావం చూపే విధంగా ఎత్తుగడలు వేస్తున్నారు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లతో కృష్ణా, గోదావరి జిల్లాలో పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పరచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.