
ఓ ఎన్ఆర్ఐ దాఖలు చేసిన కేసులో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా పేరును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సీపీ థంపి, బ్రిటన్‌కు చెందిన సుమిత్ చద్దాపై నమోదైన మనీలాండరింగ్ కేసులో భాగంగా ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్లను ఈడీ చేర్చింది.
అయితే ఇద్దర్నీ నిందితుల జాబితాలో మాత్రం ఈడీ ఇప్పటివరకు చేర్చలేదు. హర్యాణాలో భూములు, ఆస్తులు కొనుగోలుకు సంబంధించి దాఖలైన మనీ లాండరింగ్ కేసులో విచారణ జరుపుతున్న ఈడీ అధికారులు.. ఆ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా అందులో రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ పేర్లను చేర్చారు.
ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా 2006 లో హర్యాణా ఫరీదాబాద్‌లోని అమీపూర్ గ్రామంలో ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన హెచ్ఎల్ పహ్వా వద్ద 40 ఎకరాల భూమిని కొన్నారు. 2010 లో అదే భూమిని తిరిగి పహ్వాకు విక్రయించారు. అదే విధంగా 2006 లో అమీపూర్‌లో హెచ్ఎల్ పహ్వా ద్వారా.. ప్రియాంక గాంధీ ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశారు. 2010 లో అదే ఇంటిని తిరిగి పహ్వాకు అమ్మారు.
అయితే ఈ భూములు, ఇల్లు కొనుగోలు సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీలు అన్నీ విదేశాల నుంచి అక్రమంగా వచ్చాయని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ప్రధాన ఆరోపణ. విదేశాలకు చెందిన సీసీ థంపి, సుమిత్ చద్దా ద్వారా ప్రియాంక గాంధీ, ఆమె భర్త వాద్రా భూముల కొనుగోలు ద్వారా మనీలాండరింగ్ పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది.
ఈ హెచ్ఎల్ పహ్వా నుంచే అదే అమీపూర్ గ్రామంలో సీసీ థంపి సుమారు 486 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మరోవైపు రాబర్ట్ వాద్రాకు సీసీ థంపికి సంబంధాలు ఉన్నట్లు ఈ కేసులో గతంలో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లలో ఆరోపించింది. ఇక ఈ లావాదేవీలకు సంబంధించి ఆయుధ డీలర్ అయిన సంజయ్ భండారికి సీసీ థంపి, సుమిత్ చద్దా సహాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
సంజయ్ భండారికి సీసీ థంపి, సుమిత్ చద్దాలు సన్నిహితులను ఈడీ తెలిపింది. ఇక ఈ కేసుకు సంబంధించి రాబర్ట్ వాద్రాతోపాటు సంజయ్ భండారీ, సీసీ థంపి, సుమిత్ చద్దాలపై ఢిల్లీ కోర్టులో ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే సీసీ థంపి, సుమిత్ చద్దాలను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. లండన్‌లో ఉన్న 12 బ్రయాన్‌స్టన్ స్క్వేర్ ఫ్లాట్‌ను రాబర్ట్ వాద్రా కోరిక మేరకు సీసీ థంపి పునరుద్ధరణ పను చేపట్టారని ఈడీ కోర్టుకు తెలిపింది.
లండన్‌లోని 12 బ్రయాన్‌స్టన్ స్క్వేర్, 6 గ్రోస్వెనర్ హిల్ కోర్ట్, లండన్‌తో సహా అనేక విదేశీ ఆస్తులు సంజయ్ భండారీకి చెందినవని ఈడీ దర్యాప్తులో తేలింది.
అయితే ఈ రెండు ఆస్తుల్ని అక్రమంగా వచ్చిన డబ్బుతో కొనుగోలు చేశారని పేర్కొంది. సీసీ థంపి, సుమిత్ చద్దా ఈ నేరాల ద్వారా సంపాదించిన ఆస్తులను దాచిపెట్టి వినియోగించుకున్నట్లు గుర్తించారు.
ఈ కేసులో ఇప్పటికే సంజయ్ భండారీకి చెందిన రూ.26.55 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మరోవైపు, ఈ కేసులో నిందితుడిగా ఉన్న సంజయ్ భండారీ 2016 లోనే బ్రిటన్‌కు పారిపోయారు. అయితే మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ భండారీని వెనక్కి తీసుకొచ్చేందుకు ఈడీ, సీబీఐ చేసిన వినతికి బ్రిటన్ సర్కారు ఈ ఏడాది జనవరిలో ఆమోదం తెలిపింది.
More Stories
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు దేశంలోనే అత్యంత సంపన్నులు
హామీల ఎగవేతల బడ్జెట్
యూపీఐ లావాదేవీలకు రూ. 1500 కోట్ల ప్రోత్సాహకాలు