ఆర్బీఐకి బెదిరింపు మెయిల్ పంపిన ముగ్గురు అరెస్ట్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకి బెదిరింపు మెయిల్స్ రావటం పెద్ద కలకలంగా మారింది. గతంలో ప్రముఖ వ్యాపారవేత్తలను టార్గెట్ చేసిన దుండగులు ఈ సారి రూటు మార్చారు.
దీనిని సీరియస్ గా తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తులో భాగంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
గుజరాత్‌లోని వడోదర నుంచి ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. ఒకరిని ఆదిల్ రఫీగ్‌గా గుర్తించారు. మిగిలిన ఇద్దరు అతని బంధువు, బంధువు స్నేహితుడిగా గుర్తించారు. ముంబైలోని 11 చోట్ల 11 బాంబులు అమర్చినట్లు ఆర్బీఐకి మంగళవారం బెదిరింపు మెయిల్ వచ్చింది.
మంగళవారం ముంబైలో 11 బాంబు పేలుళ్ల గురించి రిజర్వ్ బ్యాంక్‌కు పంపిన బెదిరింపు మెయిల్ పోలీసులను కలవరపరిచింది. 
 
అయితే ఆర్‌బీఐ కేంద్ర కార్యాలయ భవనం, మరో రెండు బ్యాంకులతో సహా ఈ ప్రదేశాల్లో అనుమానాస్పద వస్తువు కనుగొనబడలేదు. ఆర్బీఐకి కొత్త సెంట్రల్ ఆఫీస్ బిల్డింగ్, ఫోర్ట్, చర్చ్‌గేట్‌లోని  హెచ్‌డీఎఫ్‌సీ హౌస్, ఐసీఐసీఐ బ్యాంక్ టవర్‌లో బాంబు పేలుళ్లు జరుగుతాయని బెదిరిస్తూ రిజర్వు బ్యాంక్ గవర్నర్ ఈ-మెయిల్ ఐడీకి khilafat.india@gmail.com అనే ఐడి నుండి మెయిల్ వచ్చిందని పోలీసులు వెల్లడించారు. ఆర్థిక మంత్రి సీతారామన్, గవర్నర్ శక్తికాంత దాస్ పదవులకు రాజీనామా చేయాలని, బ్యాంకింగ్ స్కామ్” బహిర్గతం గురించి పూర్తి ప్రకటనను విడుదల చేయాలని పంపినవారు డిమాండ్ చేశారు. లేదంటే బాంబులను పేల్చేస్తామని హెచ్చరించారు. 

నిందితులు పేర్కొన్న ప్రాంతాల్లో ఒకటి తర్వాత మరొకటి పేలుళ్లు జరుగుతాయని అందులో పేర్కొనటంతో బాంబు డిటెక్షన్ సిబ్బంది సహాయంతో పోలీసులు నిందితులు చెప్పిన ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అయితే వారికి అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువులు దొరకలేదని అధికారి వెల్లడించారు. ఈ క్రమంలో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.