ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపు లేదు

ఎంఫిల్ (మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశం కల్పిస్తున్న యూనివర్సిటీల గురించి విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) హెచ్చరిక జారీ చేసింది. గతంలో యూనివర్సిటీ బాడీ కోర్సును రద్దు చేసినప్పటికీ చాలా యూనివర్సిటీలు ఎంపీల్ డిగ్రీని ఆఫర్ చేస్తున్నందున ఈ హెచ్చరిక చేసింది.
 
అన్ని యూనివర్శిటీల్లో అందించే ఎంఫిల్ డిగ్రీ కోర్సు ఇకపై చట్టబద్ధం కాదని కమిషన్ గతంలో ప్రకటించింది. ఎంపీల్ ప్రోగ్రామ్‌లను అందించవద్దని ఉన్నత విద్యా సంస్థలను ఆదేశించింది. ఇంకా, 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఫిల్ ప్రోగ్రామ్‌లో అడ్మిషన్లను నిలిపివేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని విశ్వవిద్యాలయ అధికారులను కోరారు.
 
యుజిసి కార్యదర్శి మనీష్ జోషి కూడా భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు అందించే ఎంఫిల్ ప్రోగ్రామ్ లలో చేరవద్దని విద్యార్థులకు సూచించారు.  ఎంఫిల్ ప్రోగ్రామ్ కోసం కొన్ని విశ్వవిద్యాలయాలు కొత్తగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు యూజీసీ దృష్టికి వచ్చింది. దాంతో, విద్యార్థులను అప్రమత్తం చేసే ఉద్దేశంతో యూజీసీ ఈ ప్రకటన చేసింది. 
 
ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపు లేదన్న విషయం విద్యార్థులంతా గుర్తుంచుకోవాలని, అందువల్ల ఏ విభాగంలో కూడా ఎంఫిల్ కోర్సులో చేరవద్దని స్పష్టం చేసింది.  యూజీసీ చట్టంలోని నంబర్ 14 రెగ్యులేషన్ ప్రకారం ఉన్నత విద్యాసంస్థలు ఎలాంటి ఎంఫిల్ ప్రోగ్రామ్ ను అందించరాదు.
 
దేశవ్యాప్తంగా అనేక కొత్త ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటవుతున్నాయి. వాటిలో చాలా వరకు యూజీసీ గుర్తింపు లేని కోర్సులను అందిస్తున్నాయి. ఆ యూనివర్సిటీల విషయంలో విద్యార్థులు అప్రమత్తతతో ఉండాలని యూజీసీ హెచ్చరించింది. గుర్తింపు లేని యూనివర్సిటీల్లో, లేదా గుర్తింపు లేని కోర్సుల్లో చేరవద్దని సూచించింది. 
 
గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 140 వరకు ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఇలా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటులో గుజరాత్ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. గత ఐదేళ్లలో గుజరాత్ లో 28, మహారాష్ట్రలో 15, మధ్యప్రదేశ్ లో14, కర్నాకటలో 10 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి.