ఢిల్లీలోని ఇజ్రాయేల్ ఎంబీసీ వద్ద భారీ శబ్దంతో పేలుడు

* ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన ఇజ్రాయిల్
దేశ రాజధాని ఢిల్లీలోని  ఇజ్రాయేల్ ఎంబసీ వద్ద మంగళవారం సాయంత్రం భారీ శబ్దంతో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.  పేలుడు సంభవించిన వెంటనే బాంబు స్క్వాడ్‌లు, ప్రత్యేక పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సోదాలు నిర్వహించాయి. అయితే ఘటనా స్థలంలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం కూడా ఈ సంఘటనను ధృవీకరించింది. దర్యాప్తు జరుగుతోందని పేర్కొంది.
 
 “సాయంత్రం 5:08 గంటల ప్రాంతంలో రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు సంభవించిందని మేము నిర్ధారించాం. ఢిల్లీ పోలీసులు, భద్రతా బృందం పరిస్థితిని పరిశీలిస్తున్నాయి” అని ఎంబసీ అధికార ప్రతినిధి గై నిర్ మంగళవారం సాయంత్రం తెలిపారు.  దౌత్యకార్యాలయ సిబ్బంది అందరూ క్షేమంగా ఉన్నారని, కేసు దర్యాప్తు చేసేందుకు స్థానిక అధికారులతో సహకరిస్తున్నామని ఇజ్రాయేల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. గాజాపై ఇజ్రాయేల్ దాడుల నేపథ్యంలో ఢిల్లీలోని ఆ దేశ ఎంబసీ వద్ద పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు.
 
కాగా, ఈ కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరు అనుమానితులను గుర్తించారు. అనుమానితుల కదలికలను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రం సంభవించిన ఈ పేలుడులో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు లేదు. 
 
పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో ఇజ్రాయెల్ ఎంబసీ రాయబారిని ఉద్దేశించి టైప్ చేసిన లేఖ ఇజ్రాయెల్ జెండాతో చుట్టబడి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గాజాలో ఇజ్రాయెల్ చర్యలను విమర్శిస్తూ ఆ లేఖ ఉంది. ఆంగ్లంలో రాసిన ఆ లేఖలో ఇది ప్రతీకార చర్యగా పేర్కొన్నారు. కాగా ‘‘సర్ అల్లా రెసిస్టెన్స్’’ అనే సమూహం ఈ పేలుడుకు తామే బాధ్యులమని ప్రకటించింది.
 
అక్టోబరు 23న పాలస్తీనా పౌరులకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ ఢిల్లీలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టింది. అబ్దుల్ కలాం రోడ్డులోని ఇజ్రాయేల్ రాయబార కార్యాలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ర్యాలీ చేసిన వాళ్లను వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఇజ్రాయేల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత భారత్‌లోని బిహార్‌, కోల్‌కత్తాలోనూ పాలస్తీనాకు మద్దతుగా నిరసనలు జరిగాయి. మార్చ్ నిర్వహించి, ఇజ్రాయేల్ జెండాలను తగలబెట్టారు. కోల్‌కత్తాలోనూ ఇలాంటి నిరసనలే జరిగాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు.
ఈ క్రమంలో ఇజ్రాయెల్‌ జాతీయ భద్రతా మండలి భారత్‌లోని తమ పౌరులకు అడ్వైజరీని జారీ చేసింది. ఎంబసీ వద్ద పేలుడును ఉగ్రవాద దాడిగా ఇజ్రాయెల్‌ అభివర్ణించింది. జ్యూయిస్‌ పౌరులు మాల్స్‌, మార్కెట్లు తదితర రద్దీ ప్రదేశాలకు వెళ్లొద్దని సూచించింది.  రెస్టారెంట్లు, హోటళ్లు, పబ్బులు, బహిరంగ ప్రదేశాలతో పాటు అన్నిచోట్లా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
గుంపులుగా ఎక్కడికీ వెళ్లవద్దని.. ఎక్కడికి వెళ్లినా తమ ఐడెంటినీ సాధారణ వ్యక్తులకు చెప్పొద్దని సూచించింది. సోషల్‌ మీడియాలో ఫొటోలను పోస్ట్‌ చేయొద్దని చెప్పింది. కాగా, 2021 జనవరిలో ఎంబసీ వద్ద స్వల్ప తీవ్రతతో బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ పేలుడుపై ఎన్‌ఐఏ ఇంకా విచారణ జరుపుతున్నాయి. ఇటీవల మళ్లీ ఎంబసీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. హోంమంత్రిత్వ శాఖ ఆదేశాలతో ఎంబసీ వద్ద భద్రతను పెంచారు.