సంచలనాలతో `న్యూస్ మేకర్’ గా మిగిలిపోతున్న షర్మిల!

ఉమ్మడి తెలుగు రాష్ట్ర రాజకీయాలలో ఓ సంచలనంగా నిలదొక్కుకున్న మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెగా తప్ప రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత సంపాదించుకోలేక పోతున్న వై ఎస్ షర్మిల జులై, 2021లో తన అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో కాకుండా తెలంగాణాలో `రాజన్న ఆశయం’ కోసం అంటూ వైఎస్సాఆర్ టిపి పేరుతో ఓ ప్రాంతీయ పార్టీని ప్రకటించినప్పటి నుండి తరచూ సంచలనాలకు కేంద్రంగా ఉంటూ వస్తున్నారు.
 
అప్పటి నుండి ఎవ్వరూ ఊహించని విధంగా ఏదో ఒక సంచలన ప్రకటన చేస్తూ వార్తల్లో నిలబడటమే గాని క్షేత్రస్థాయిలో ఎటువంటి ప్రభావం చూపలేక పోతున్నారు. తాజాగా తండ్రి రాజశేఖరరెడ్డి రోజుల నుండి తమకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉంటూ వస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ వారసుడైన నారా లోకేష్ కు క్రిస్మస్ గ్రీటింగ్స్  పంపడం ద్వారా రాజకీయంగా కలకలం రేపారు.
 
ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారని, ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేబట్టపోతున్నారని, కర్ణాటక నుండి ఆమెను కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపబోతున్నదని మీడియాలో వార్త కధనాలు వస్తున్న సమయంలోనే ఆమె పంపిన ఈ క్రిస్మస్ గిఫ్ట్ పెద్ద దుమారం రేపింది. తన అన్న జగన్ మోహన్ రెడ్డికి గాని, తాను చేరాలి అనుకొంటున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రరాజుకు గాని పంపకుండా లోకేష్ కు పంపడంలో ఆంతర్యం ఎవ్వరికీ తెలియడం లేదు.
 
తన జీవితాంతం కాంగ్రెస్ నేతగా కొనసాగుతూ ప్రత్యర్థి అయిన తెలుగుదేశంతో పోరాడిన యోధుడిగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి రాజకీయ చరిత్ర ఉన్నది. కాంగ్రెస్ నాయకుడుగా రాజశేఖర్ రెడ్డి, తెలుగుదేశం నాయకుడుగా చంద్రబాబు నాయుడులు తొలి దశలో స్నేహితులుగా ఉన్నప్పటికీ, చంద్రబాబు తెలుగుదేశంలో చేరాక ఆయన్ని రాజకీయ ప్రత్యర్థిగానే రాజశేఖర్ రెడ్డి చూశారు.
దానితో ఇప్పుడు రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల లోకేష్ కు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. తెలంగాణాలో `రాజన్న రాజ్యం’ కోసం సుమారు 3,000 కిమీ మేరకు పాదయాత్ర జరిపి, అన్ని సీట్లలో పోటీ చేస్తానని ప్రకటించి, తాను స్వయంగా పాలేరు నుండి పోటీ చేస్తున్నట్లు ఏడాది ముందుగానే ప్రకటించి తీరా ఎన్నికలు వచ్చేసరికి తోక ముడిచారు.
ఆమె పార్టీ పోటీ చేస్తే తెలంగాణాలో 1 శాతంకు మించి ఓట్లు రావని, ఆమెకు స్వయంగా పాలేరులో 3 శాతంకు మించి ఓట్లు రావని పీపుల్స్ పల్స్
అధ్యయనం వెల్లడించింది. దానితో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి, తనను ఏదో విధంగా తెలంగాణ అసెంబ్లీకి పంపమని రాయబారాలు నడిపారు. స్వయంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిశారు. 
 
అయితే, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎదురు తిరగడంతో సాధ్యం కాలేదు. ఆ అక్కసుతో తనను కాంగ్రెస్ లో చేరకుండా అడ్డుకున్న రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయవద్దంటూ ఆయన పేరు ప్రస్తావించకుండా ఘాటయిన పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పలు సార్లు మంతనాలు జరిపినా ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు.
 

తమ కుటుంబం పట్ల అవమానకరంగా సోనియా వ్యవహరించారనే ఆరోపణలతో అన్న జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ ను విడిచి, మరో పార్టీ ఏర్పాటు చేసి, ఏపీలో అధికారంలోకి వచ్చారు. కానీ, సోనియాను కలిసిన తర్వాత రాజశేఖర్ రెడ్డి పట్ల సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ఎంతో అభిమానం ఉందని షర్మిల ప్రకటించడం గమనార్హం.

దానితో, షర్మిల రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ లో కొనసాగుతుందని అంతా భావిస్తున్న సమయంలో  ఆమె తెలుగుదేశం నాయకుడు లోకేష్ కు క్రిస్టమస్ గ్రీటింగ్స్ చెప్పటం ఆమె రాజకీయ ప్రయాణంలో గందరగోళాన్ని వెల్లడి చేస్తుంది.  షర్మిల తెలుగుదేశంతో స్నేహానికి ప్రయత్నిస్తున్నారా? లేదా కేవలం న్యూస్ మేకర్ కావటానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇప్పటికే తెలంగాణలో తన పార్టీని సంచలనంగా ప్రారంభించి, సంచలనంగా ముగించిన షర్మిల మనస్తత్వం ఏమిటని మానసిక నిపుణులు సహితం తేల్చుకోలేకపోతున్నారు.   ఇటీవల రాజకీయాల్లో ఏదో ఒక రకంగా సంచలనంగా ఉండాలని మనస్తత్వం పెరిగిందని దానిలో భాగంగా ఎవరు ఊహించని విధంగా రాజకీయ నాయకులు నిర్ణయాలు చేస్తున్నారని మనస్తత్వ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

షర్మిల కూడా కేవలం సంచలనం కోసమే లోకేష్ కి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనుకుంటే ఆమె లోకేష్ కు క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలపటం సాధారణమైన అంశంగా చూడటానికి వీలు లేని అంశం ఇది. ఇప్పటి వరకు తాను తెలంగాణ కోసమే పనిచేస్తానని చెబుతున్న షర్మిల ఇప్పుడు తెలంగాణాలో ఇక్కడి ప్రత్యర్ధులైన కెసిఆర్ లేదా కేటీఆర్ లకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పిన దాఖలాలు లేవు.

లేదా కనీసం రేవంత్ రెడ్డి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపినట్టు చూడలేదు. తనకి పరాయి రాష్ట్రం (ఆమె మాటలు ప్రకారం) అయిన ఆంధ్రప్రదేశ్ లోని కాంగ్రెస్ పార్టీ నాయకుడైన రుద్రరాజుకి కాకుండా లోకేష్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలపటం నిలకడలేని ఆమె వ్యవహారాన్ని వెల్లడి చేస్తుంది.  షర్మిల తెలుగుదేశం ప్రాపకం కోసం పాకులాడుతుందని విమర్శ వస్తే ఆమె దగ్గర ఉన్న సమాధానం ఏమిటో తెలియదు.

నిరంతరం ఏదో రకంగా న్యూస్ లో ఉండాలని తన చుట్టూ నెగిటివ్ ఆర్ పాజిటివ్ న్యూస్ నడవాలని భావించే వారి మనస్తత్వం లోంచి ఇలాంటి చర్యలు ఉంటాయని కొందరు భావిస్తున్నారు. ఇక రాజకీయాలు విషయానికొస్తే షర్మిల కాంగ్రెస్ లో కొనసాగాలి అనుకుంటే ఆమె ఎక్కడ కొనసాగాలో నిర్ణయించుకోలేని స్థితిలో ఆమె ఉన్నట్లు స్పష్టం అవుతుంది.

షర్మిలకు ఏమాత్రం అవగాహన ఉన్నా కూడా  తెలంగాణలో పార్టీ పెట్టడానికి తలబడేవారు కాదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. గతంలో అన్న జగన్ మోహన్ రెడ్డిని అక్రమార్జన కేసులలో అరెస్ట్ చేసినప్పుడు ఆగిపోయిన తన `ఓదార్పు యాత్ర’ను కొనసాగించమని చెల్లెలును కోరిన దాఖలాలు లేవు.  ఇక అన్న జైలు నుండి బైటకు రాకపోవచ్చులే అనుకొంటూ ఆ పార్టీ నాయకత్వం కైవసం చేసుకొనేందుకు భర్త ప్రోద్భలంతో ఆమె `ఓదార్పు యాత్ర’ చేపట్టినట్లు తెలుస్తోంది.  మొదటి నుండి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ వ్యవహార శైలి పట్ల ముఖ్యమంత్రి జగన్ అసహనంతో ఉంటున్నట్లు తెలుస్తున్నది. 
 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఏపీలో క్రైస్తవ మతమార్పిడులు విపరీతంగా పెరిగిపోయాయని, చివరకు తిరుమల క్షేత్రంలో కూడా వ్యాపించాయని ప్రచారం జరిగేందుకు కూడా బ్రదర్ అనిల్ కుమార్ కారకుడుగా భావిస్తుంటారు.
 
అందుకనే 2014 ఎన్నికలలో కడప, ఒంగోలు లేదా విశాఖపట్టణం నుండి షర్మిల లోక్ సభకు పోటీ చేయాలని అనుకోవడం కూడా పార్టీలో `రెండో అధికార కేంద్రం’ ఏర్పాటుకు అనిల్ కుమార్ ఎత్తుగడగా భావించారు. అందుకనే కనీసం ఆమెను రాజ్యసభకు పంపేందుకు కూడా ఇష్టపడలేదు. దానితో ఆమె తెలంగాణాలో పార్టీ ఏర్పాటు చేయడం ద్వారా ఏపీలో జగన్ పై వత్తిడి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు.
 
షర్మిల ఎంతగా ప్రచారం చేసినా రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియాలో వార్తలకు అవకాశం తప్ప ఎక్కడా కూడా కాంగ్రెస్ కు ఓట్లు తేగల సామర్థ్యం ఆమెకు లేదని కాంగ్రెస్ నాయకులు అందరికి తెలుసు. అందుకనే ఆమెను రాజ్యసభకు పంపే విషయంలో సహితం నిర్దిష్టంగా భరోసా ఇవ్వలేక పోతున్నారు. ఒక విధంగా ఈ విషయంలో కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి తెచ్చేందుకు ఆమె లోకేష్ కు క్రిస్మస్ గ్రీటింగ్స్ పంపారా? అనే అనుమానం కలుగుతుంది.